నోటి పుండుపై నిర్లక్ష్యం వద్దు
- రోజుకు 560 క్యాన్సర్ కేసులు
- పొగాకు, కైనీ, మద్యానికి దూరంగా ఉండాలి
- కేర్ ఆసుపత్రి వైద్యుల సూచన
హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): నోటిలో తగ్గని పుండ్లు, మచ్చలు నోటి క్యాన్సర్‌కు దారితీస్తాయని, పొగాకు, సుపారీ అలవాట్లకు దూరం ఉండాలని కేర్ ఆసుపత్రి వైద్యులు హెచ్చరించారు. జూలై 27న ప్రపంచ తల, మెడ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా పలు జాగ్రత్తలను, నివారణ మార్గాలను కేర్ ఆసుపత్రి ప్రముఖ వైద్యుడు రాము దాములూరి వివరించారు. క్యాన్సర్ లక్షాలను సకాలంలో గుర్తించి పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుర్తించి చికిత్స తీసుకొని నివారించుకోవచ్చన్నారు. గ్లోబోకాన్2024 అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతీయేటా 2.06 లక్షల పెదవి, నోటీ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని, 86వేల మంది మృతి చెందుతున్నారని, సగటున రోజుకు 560 కొత్త కేసులు, 236 మరణాలు సంభవిస్తున్నాయని, పురుషుల్లోనే నోటి క్యాన్సర్ అధికంగా ఉంటుందన్నారు. దీనికి పొగాకు, పాన్ మసాలా, గుట్కాలే కారణమన్నారు.
రెండువారాలకు పైగా నోటిలో తగ్గని పుండ్లు, కారం తింటే మంట, నోరు తెరుచుకోకపోవడం వంటి మార్పులు కనిపిస్తాయన్నారు. ఈ దశలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం ద్వారా క్యాన్సర్‌ను అడ్డుకోవచ్చన్నారు. ప్రారంభదశలో గుర్తిస్తే చిన్న చిన్న చికిత్సల ద్వారా నయం చేసుకోవచ్చని, ఆలస్యం జరిగితే లింఫ్ గ్రంథుల తొలగింపు, శస్త్రచికిత్సలు, రేడియోషన్, కీమోథెరపీ వంటి క్లిష్టమైన చికిత్సలు అవుసరమవుతాయన్నారు. కేర్ ఆసుపత్రి సీనియర్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ ఎండీ కరీముల్లా ఖాన్ మాట్లాడుతూ.. గొంతుసమస్యలను చాలామంది సాధారణ ఇన్‌ఫెక్షన్‌గా భావించి ఆలస్యం చేస్తున్నారని, ఇలాంటి వాటిని నిర్లక్ష్యం చేయకూడదని పేర్కొన్నారు.






