27 July, 2026 | 2:19 AM

చదువుల పేరిట.. ‘లంచాల’ బేరం..!

27-07-2026 01:53 AM
  1. ప్రైవేటు స్కూళ్ల అనుమతుల పేరుతో విద్యాశాఖ అధికారుల అవినీతి దందా
  2. నోటీసులతో భయపెట్టి యజమానులను పిండుకుంటున్న వైనం
  3. మధ్యవర్తులుగా మారుతున్న ‘క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు’ 
  4. రూ.5లక్షల లంచం వాటా తేలక.. నాగోల్ పోలీస్‌స్టేషన్‌కు చేరిన పంచాయతీ..!
  5. క్షేత్రస్థాయి తనిఖీలు నిల్.. పిల్లల భద్రత గాలికి..!

రంగారెడ్డి/ఎల్బీనగర్, జూలై 26 (విజయక్రాంతి): దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుంది‘ అన్నది ప్రసిద్ధ కోఠారీ కమిషన్ నివేదిక. కానీ, విద్యాశాఖలోని కొందరు అధికారుల లంచాల దాహానికి ఆ మాటలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. సరళీకరణ, ప్రపంచీకరణ ముసుగులో విద్య కాస్తా లాభసాటి ’వ్యాపారం’గా మారిపోయింది. ఏటా పెట్టిన పెట్టుబడికి రెండింతల లాభాలు వస్తుండటంతో గల్లీగల్లీకి పుట్టగొడుగుల్లా ప్రైవేటు స్కూళ్లు వెలుస్తున్నాయి. ఇదే యజమానుల ఆరాటాన్ని తమకు ఆదాయ మార్గంగా మలుచుకున్న విద్యాశాఖ అధికారులు.. నిబంధనల పేరుతో కొత్త దందాలకు తెరలేపారు.

కొర్రీల వేధింపులు.. సీఆర్పీల ‘బేరసారాలు’

నిబంధనల ప్రకారం.. కొత్త ప్రైవేట్ స్కూల్ ప్రారంభించాలంటే సొసైటీ రిజిస్ట్రేషన్, అగ్నిమాపక (ఫైర్) సేఫ్టీ, బిల్డింగ్ సౌండ్నెస్, శానిటేషన్, ట్రాఫిక్ ఎన్ ఓ సీ పత్రాలతో పాటు విస్తారమైన క్లాస్ రూమ్లు, అర్హత గల ఉపాధ్యాయులు ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తు రాగానే ఎంఈఓ లేదా డిఈఓ బృందం స్వయంగా స్కూలుకు వెళ్లి తనిఖీ చేయాలి.కానీ క్షేత్రస్థాయిలో సీన్ పూర్తిగా రివర్స్... దరఖాస్తు రాగానే ‘ఆ పేపర్ లేదు.. ఈ పర్మిషన్ లేదు‘ అంటూ అధికారులు కట్టుకథలతో నోటీసులు జారీ చేసి యజమానులను భయపెడుతున్నారు.

వారు భయపడగానే ’క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు’ ( సిఆర్పీలు ) రంగప్రవేశం చేస్తున్నారు. ‘మేమున్నాం.. అధికారులు మా చేతిలోనే ఉన్నారు‘ అంటూ ఓపెన్గానే బేరసారాలకు దిగుతున్నారు. డబ్బిస్తే చాలు.. ఎలాంటి తనిఖీలు లేకుండా, నిబంధనలు పాటించకపోయినా సీఆర్పీలు ఇచ్చే గుడ్డి నివేదికలపై అధికారులు ఆనందంగా సంతకాలు పెట్టేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా శేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, ఎల్బీనగర్, షాద్నగర్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం నియోజక వర్గాలలో  అనుమతి లేని పాఠశాలలు తోక పేర్లతో పుట్టగొడుగుల వెలిశాయి.

వెలుగులోకి వచ్చిన ‘రూ. 5 లక్షల’ లంచం రచ్చ..

సరూర్ నగర్ మండల విద్యాశాఖ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్లో ఉన్న ఒక కిడ్స్ స్కూల్ అనుమతి కోసం ఓ సీఆర్పీ మధ్యవర్తిగా చక్రం తిప్పాడు. పాఠశాలకు పర్మిషన్ ఇప్పిస్తామని నమ్మించి, విడతల వారీగా స్కూల్ యజమాని నుంచి ఏకంగా రూ. 5 లక్షలు దండుకున్నారు. అయితే, ఈ లంచం లావాదేవీల పంపకాల్లో తేడాలు రావడంతో ఇరువర్గాల మధ్య గొడవ మొదలైంది. చివరకు ఈ ’పర్మిషన్ల పంచాయతీ’ నాగోల్ పోలీస్ స్టేషన్కు చేరి కేసు నమోదు వరకు వెళ్లింది. వెలుగులోకి వచ్చిన ఒక్క సంఘటనే అయినా.. లోపల ఇలాంటి అక్రమ అనుమతుల దందాలు వందల్లో ఉన్నాయని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు  గుసగుసలాడుతున్నారు.

పిల్లల భవిష్యత్తుతో చెలగాటం..

అనుమతుల పేరుతో జరుగుతున్న ఈ వ్యాపారంలో నష్టపోతోంది మాత్రం అమాయక విద్యార్థులే. కనీస భద్రత, ఫైర్ సేఫ్టీ, మంచి గాలి-వెలుతురు లేని భవనాల్లో స్కూళ్లకు అనుమతులిచ్చేసి అధికారులు తమ జేబులు నింపుకుంటున్నారు. రేపు ఏదైనా ప్రమాదం జరిగితే పిల్లల ప్రాణాలకు బాధ్యులెవరని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు నిద్రమత్తు వదిలి, సరూర్ నగర్ మండల పరిధిలో పాటు జిల్లా వ్యాప్తంగా తోక పేర్లు ఉన్న ప్రభుత్వ నియమ, నిబంధనలుకు విరుద్ధంగా అక్రమంగా నడుస్తున్న స్కూళ్లపై, లంచాలకు అలవాటుపడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.