14 August, 2026 | 2:21 AM

బడంగ్‌పేట్‌లో పార్కు స్థలం కబ్జా!

14-08-2026 12:00 AM

గ్లోబల్ స్కూల్ యాజమాన్యం, బిల్డర్ల అక్రమాలు

ఆర్టీఐలో అక్రమం అని నిర్ధారణ

అయినా కదలని మున్సిపల్ యంత్రాంగం

చర్యలు తీసుకోవాలని శ్రీ నిలయ టౌన్షిప్ అసోసియేషన్ డిమాండ్

బడంగ్‌పేట్, అగస్టు 13 (విజయక్రాంతి): బడంగ్పేట్ డివిజన్ పరిధిలోని శ్రీ నిలయ టౌన్షిప్ (సర్వే నంబర్ 88)లో సుమారు రూ. 3 కోట్ల విలువైన ప్రభుత్వ పార్కు స్థలంతో పాటు ప్రజా రోడ్లు కబ్జాకు గురవుతుంటే మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కాలనీవాసులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

కాలనీలోని సర్వే నంబర్ 88లో ఉన్న ప్రభుత్వ పార్కు స్థలాన్ని స్థానిక గ్లోబల్ స్కూల్ యాజమాన్యం అక్రమంగాఆక్రమించుకున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అట్టి స్థలం లో స్కూలుకు చెందిన ఆట వస్తువులను ఏర్పాటు చేసి, కాలనీలోని ప్రజలను, పిల్లలను లోపలికి రానివ్వకుండా దౌర్జన్యానికి దిగుతున్నారని అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపించారు. గతంలో నే మున్సిపల్ అధికారులు అట్టి స్థలం లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ హెచ్చరిక బోర్డును సైతం  స్కూల్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా తొలగించిందని తెలిపారు.

450 గజాల రోడ్డు కబ్జా..

మరోవైపు ప్రైవేటు బిల్డర్లు నిబంధనలను బొందపెట్టి టౌన్షిప్లోని ఉత్తరం, తూర్పు, పడమర వైపులా ఉన్న రోడ్లను కలిపేసి దాదాపు 450 గజాల రోడ్డు స్థలాన్ని ఆక్రమించారు. ఆ స్థలంలో అక్రమంగా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అంగీకరించినా చర్యలు శూన్యం..

ఈ కబ్జాలపై శ్రీ నిలయ టౌన్షిప్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు సమాచార హ క్కు చట్టం ద్వారా ప్రశ్నించగా, ఇవి అక్రమ నిర్మాణాలేనని మున్సిపల్ అధికారులు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అయితే అ ధికారులు అక్రమాలను అంగీకరించి 5 నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు ఆక్రమణల తొలగింపునకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

ఆక్రమణల విషయమై బడంగ్పేట్ మున్సిపల్ అధికారులకు, డిప్యూ టీ కమిషనర్కు లే-అవుట్ కాపీలతో సహా పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా స్పందన కరువైందని శ్రీ నిలయ టౌన్షిప్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దేవరకొం డ రామ్మోహన రావు తెలిపారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కబ్జాల బారిన పడిన రూ. 3 కోట్ల విలువైన పార్కు స్థలాన్ని, రోడ్లను కాపాడాలని, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.