30 June, 2026 | 8:41 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •  

కుక్కల నియంత్రణ పేరిట కాగితాల మాయాజాలం

09-04-2026 12:08 AM
  1. ప్రజలపై పెరుగుతున్న దాడులు, ప్రాణాలకు ముప్పు!

స్టెరిలైజేషన్ పేరుతో లక్షల ఖర్చు.. 

ఫీల్డ్లో మాత్రం రెట్టింపవుతున్న కుక్కల సంఖ్య 

రేబీస్ వంటి ప్రాణాంతక వ్యాధుల భయం

హుస్నాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): హుస్నాబాద్ మున్సిపాలిటీలో కుక్కల నియంత్రణ కోసం అమలు చేస్తున్న జంతు జనన నియంత్రణ (ఎనిమల్ బర్త్ కంట్రోల్) కార్యక్రమం తీవ్ర అనుమానాల మధ్య నిలిచిపోయింది. అధికారుల లెక్కల ప్రకారం వందలాది వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ శస్త్రచికిత్సలు నిర్వహించామని, లక్షల రూపాయలు ఖర్చు చేశామని చెబుతున్నప్పటికీ, భూస్థాయిలో కనిపిస్తున్న పరిస్థితులు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉన్నాయి.

ఆపరేషన్ చేసినట్లు రికార్డుల్లో చూపించిన కుక్కలే మళ్లీ పిల్లలను కనడం స్థానిక ప్రజల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది. నిజంగా ఆపరేషన్లు జరిగాయా? జరిగితే సరైన విధంగా జరిగాయా? లేక కేవలం కాగితాలపైనే ఖర్చులు చూపించారా? అనే అనుమానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. కొన్ని కాలనీల్లో ఒకే కుక్కకు పలుమార్లు ఆపరేషన్ చేసినట్లు రికార్డులు నమోదు చేసి నిధులను దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు రావడం పరిస్థితిని మరింత అనుమానాస్పదంగా మారుస్తోంది. నియమాల ప్రకారం స్టెరిలైజేషన్ చేసిన కుక్కలకు చెవికి కోత లేదా ప్రత్యేక ట్యాగ్ వేయాలి.

అయితే పట్టణంలో తిరుగుతున్న అనేక కుక్కలకు అలాంటి గుర్తులు లేకపోవడం గమనార్హం. ఇది రికార్డుల్లో చూపిస్తున్న ఆపరేషన్లపై మరింత అనుమానాలకు తావిస్తోంది. వైద్య ప్రమాణాలు పాటించకపోవడం వల్లే కుక్కలు మళ్లీ జననానికి గురవుతున్నాయా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా, కుక్కల సంఖ్య నియంత్రణలో విఫలమవ్వడం వల్ల పట్టణంలో వీధి కుక్కల సంచారం గణనీయంగా పెరిగింది.

ఒక్కో కుక్క నాలుగు నుంచి ఐదు పిల్లలను కనడం వల్ల కాలనీల్లో కుక్కల గుంపులు పెరుగుతున్నాయి. దీంతో రాత్రి వేళల్లో ప్రజలు బయటకు రావడానికే భయపడే పరిస్థితి నెలకొంది. ఇక కుక్కల దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. కుక్కలు కరిస్తే రేబీస్  అనే ప్రాణాంతక వ్యాధి సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రేబీస్ సోకిన తర్వాత చికిత్స ఆలస్యం అయితే ప్రాణాలకు ముప్పు తప్పదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఈ ప్రమాదానికి ఎక్కువగా గురయ్యే అవకాశముంది.

కుక్క కరిచిన వెంటనే సరైన టీకాలు వేయించకపోతే పరిస్థితి విషమించవచ్చని వైద్యవర్గాలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, జంతు జనన నియంత్రణ కార్యక్రమం సరైన విధంగా అమలు కాలేదనే ఆరోపణలు బలపడుతున్నాయి. కేటాయించిన నిధులు నిజంగా వినియోగించబడ్డాయా? లేక కేవలం కాగితాలపైనే చూపించారా? అనే ప్రశ్నలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.

ప్రజల భద్రతకు సంబంధించిన ఈ కీలక అంశంపై ఉన్నతాధికారులు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, కుక్కల నియంత్రణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, శాస్త్రీయంగా అమలు చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతున్నారు.