లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం మిలీనియం నూతన సెక్రటరీ గా పగడాల నరేష్
కొత్తగూడెం,విజయక్రాంతి): సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ, ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన 7వ నెంబర్ బజారు, 15వ డివిజన్ వాసి అయిన, లయన్ పగడాల నగేష్‌ను లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం మిల్లినియం నూతన సెక్రటరీగా 2026-2027 సంవత్సరానికి జరిగిన క్లబ్ జనరల్ బాడీ సమావేశంలో, సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం విశేషంగా నిలిచింది. సేవే ధ్యేయంగా ముందుకు సాగుతున్న లయన్స్ క్లబ్‌లో నగేష్ గత కొంతకాలంగా వివిధ సేవా కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటూ క్లబ్ అభివృద్ధికి విశేష కృషి చేశారు.
విద్యార్థులకు సహాయం, వైద్య శిబిరాలు, రక్తదాన కార్యక్రమాలు, పేదలకు ఆర్థిక సహాయం, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, వంటి అనేక సేవా కార్యక్రమాల్లో ఆయన చూపిన చొరవ సభ్యుల ప్రశంసలను అందుకుంది. నాయకత్వ లక్షణాలు, సేవాభావం, సభ్యులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ అందరినీ కలుపుకొని పనిచేసే తత్వం కారణంగానే నగేష్‌పై సభ్యులు పూర్తి విశ్వాసం ఉంచి సెక్రటరీ బాధ్యతలను అప్పగించినట్లు క్లబ్ సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు, స్నేహితులు, అభిమానులు నగేష్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం మిల్లినియం మరింత సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. లయన్ పగడాల నగేష్ మాట్లాడుతూ ,తనపై నమ్మకం ఉంచి సెక్రటరీగా ఎన్నుకున్న క్లబ్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. క్లబ్ అభివృద్ధితో పాటు సమాజ సేవకు మరింత ప్రాధాన్యత ఇస్తూ అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని పేర్కొన్నారు.






