19 May, 2026 | 4:58 AM

కేకలు వేసేవాళ్లకు మా సినిమా అంకితం

30-12-2025 12:00 AM

యువ కథానాయకుడు శ్రీనందు నుంచి వస్తున్న కొత్త సినిమా ‘సైక్ సిద్ధార్థ’. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సౌజన్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వరుణ్‌రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీనందు, శ్యామ్‌సుందర్‌రెడ్డి తుడి నిర్మించారు. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్ మంచి స్పందన దక్కించుకున్నాయి.

‘అఖండ2’తో పోటీ పడలేక ఈ సినిమాను వాయిదా వేసిన మేకర్స్ జనవరి 1న విడుదల కానున్న సందర్భంగా ఈ మూవీ టీమ్ సోమవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీనందు మాట్లాడుతూ.. “దండోరా’లో నా నటనపై ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ టైమ్‌లో ఆ ప్రశంసలు నాకు బూస్ట్ ఇచ్చింది. 2026 తెలుగు సినిమా ‘సైక్ సిద్ధార్థ’తో ప్రారంభం కాబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. 100% చెబు తున్నా.. ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. అందరికీ నచ్చుతుంది” అన్నారు.

హీరోయిన్ యామిని భాస్కర్ మాట్లాడుతూ.. ‘మళ్లీ సినిమాలు చేయాలనే ధైర్యం ఈ సినిమా ఇచ్చింది. జీవితంలో సెకండ్ ఛాన్స్ చాలా ఇంపార్టెంట్. ఇది కూడా నా కెరీర్‌లో ఒక సెకండ్ ఛాన్స్. ఇది న్యూ ఏజ్ ఫిలిం. అందరూ కనెక్ట్ అవుతారు” అని తెలిపింది. ‘థియేటర్స్‌కి వచ్చి గట్టిగా కేకలు వేసి ఫుల్‌గా ఎంజాయ్ చేసే తెలుగు ఆడియన్స్‌కి ఈ సినిమా అంకితం. కనీసం 30 నిమిషాల పాటు నాన్‌స్టాప్‌గా కేకలు వినిపిస్తాయ’ని డైరెక్టర్ వరుణ్‌రెడ్డి చెప్పారు.

నిర్మాత డీ సురేశ్‌బాబు మాట్లాడుతూ.. “కొన్నిసార్లు చిన్న సినిమాలనే ఎక్కువ మంది థియేటర్లలో చూస్తున్నారు. చిన్న సినిమాలపై ప్రేక్షకులకు నమ్మకమైతే ఉంది. డైరెక్టర్ వరుణ్ ఈ మూవీని చాలా డిఫరెంట్ ప్రజెంట్ చేశాడు. ఈ సినిమా టికెట్ ధర రూ.99గా నిర్ణయించాం” అని తెలిపారు. సంగీత దర్శకుడు స్మరణ్‌సాయి మాట్లాడుతూ.. “ఇది చాలా మంచి ఫన్ సినిమా. దాదాపు 100 సార్లు సినిమా చూశాను. చూసిన ప్రతిసారి విపరీతంగా ఎంజాయ్ చేశాను” అని తెలిపారు.