నకిలీ బిల్లులు.. నాసిరకం ఫ్యాన్లు..!
ఒరిజినల్ టెండర్.. డూప్లికేట్ సప్లై..
అంగన్వాడీ పరికరాల్లో భారీ గోల్మాల్?
రూ. 20 లక్షల పనుల్లో సగం స్వాహా!
రూ. 2400 ఫ్యాన్ బిల్లు.. రూ. 1400 మోడల్ సప్లై
అంగన్వాడీల్లో బరితెగించిన అవినీతి!
కట్టంగూరు, మే 13 : పసిపిల్లలకు పౌష్టికాహారం అందిస్తూ, వారి భవిష్యత్తుకు పునాది వేయాల్సిన అంగన్వాడీ కేంద్రాలు ఇప్పుడు అవినీతి తిమింగలాలకు కాసుల కురిపించే కేంద్రాలుగా మారాయి. నల్లగొండ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు ఫ్యాన్లు, ట్యూబ్లైట్ల సరఫరా పేరుతో లక్షల రూపాయల ప్రజాధనాన్ని నిలువునా ముంచేశారు. బ్రాండెడ్ వస్తువుల ధరలు చూపించి.. నాసిరకం మోడళ్లను అంటగడుతూ దాదాపు రూ. 10 లక్షల మేర చేతివాటం ప్రదర్శించిన వైనం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందనే ప్రచారం జోరుగా సాగుతుంది.
వాస్తవానికి జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ప్రత్యేక చొరవతో అంగన్వాడీల రూపురేఖలు మార్చాలని భావిస్తే, క్షేత్రస్థాయి అధికారులు మాత్రం ఆయన ఆశయాలకు తూట్లు పొడిచినట్లు తెలుస్తుంది. మినరల్ ఫండ్స్ నిధులను మళ్లించేందుకు వేసవి సెలవులను అస్త్రంగా చేసుకున్న అక్రమార్కులు, బినామీ టెండర్లతో ఐసీడీఎస్ కార్యాలయాన్నే అవినీతికి అడ్డాగా మార్చేశారు. రూ. 2200 ఫ్యాన్కు బిల్లు పెట్టి రూ. 1400 వస్తువును సరఫరా చేస్తూ నయా స్కామ్కు తెరలేపారని జిల్లాలో జోరుగా చర్చలు సాగుతున్నాయి.
బ్రాండ్ పేరిట బరితెగింపు! :
నల్లగొండ జిల్లాలోని 802 అంగన్వాడీ కేంద్రాలకు ఫ్యాన్లు, 1060 కేంద్రాలకు ట్యూబ్లైట్లు సరఫరా చేసేందుకు కలెక్టర్ మినరల్ ఫండ్స్ నుంచి సుమారు రూ.20 లక్షలు కేటాయించారు. అయితే కాంట్రాక్ట్ నిబంధనలను సదరు కాంట్రాక్టర్ తుంగలో తొక్కినట్లు తెలుస్తుంది. టెండర్ ప్రకారం రూ. 2,243 విలువైన ’క్రాంప్టన్ హైస్పీడ్ హెచ్పీ ప్లస్’ మోడల్ సరఫరా చేయాలి. కానీ వాస్తవికంగా సరఫరా అయింది మాత్రం కేవలం రూ. 1,400 విలువ చేసే ’సీవైండ్’ మోడల్. అంటే ప్రతి ఫ్యాన్ మీద రూ. 843 నొక్కేసినట్లు విశ్వసనీయ సమాచారం.
అంటే ఒక్క ఫ్యాన్ల కొనుగోలులోనే రూ. 7 లక్షల కుంభకోణం జరిగినట్లు అంచనాలు వేస్తున్నారు. ఇదే సమయంలో రూ. 264 విలువైన ’ఫిలిప్స్ 3-ఇన్-1 ఎల్‌ఈడీ’ లైట్లకు బదులుగా, మార్కెట్లో కేవలం రూ. 110 లకే దొరికే అత్యంత నాసిరకమైన స్లిమ్ మోడళ్లను సరఫరా చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో దాదాపు రూ. 2 లక్షల నిధులు పక్కదారి పట్టాయనీ స్థానికంగా వినిపిస్తుంది
గుట్టుగా వేసవి సెలవుల్లో..:
సాధారణంగా ఏప్రిల్లో జరగాల్సిన సరఫరాను కావాలనే వేసవి సెలవుల వరకు సాగదీసినట్లు సమాచారం. అంగన్వాడీ కేంద్రాలు మూసి ఉంటే.. ఎవరూ క్వాలిటీని తనిఖీ చేయరనేది వీరి మాస్టర్ ప్లాన్. జిల్లా కొనుగోలు కమిటీ పర్యవేక్షణ లేకుండానే మెటీరియల్ను నేరుగా సెక్టార్ ఆఫీసులకు పంపించి, సూపర్వైజర్ ల ద్వారా సంతకాలు చేయించుకోవడం వెనుక పెద్ద నెట్వర్కే ఉందనేధి అందరు గమనిస్తున్న విషయమే.
ఈ మొత్తం స్కామ్ వెనుక ఐసీడీఎస్ కార్యాలయంలో ఏళ్ల తరబడి తిష్టవేసిన ఒక డిప్యుటేషన్ ఉద్యోగి పాత్ర ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి నకిరేకల్ పరిధిలో ఉండాల్సిన ఆ వ్యక్తి, జిల్లా ఆఫీసులో చక్రం తిప్పుతూ హైదరాబాద్కు చెందిన తన బినామీలతో టెండర్లు వేయించి ఈ దోపిడీకి తెరలేపినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
కలెక్టర్ నమ్మకంను వమ్ము చేస్తున్న యంత్రాంగం :
సంగారెడ్డి జిల్లాలో అంగన్వాడీలను అభివృద్ధి చేసిన అనుభవంతో నల్లగొండలోనూ అదే మార్పు తేవాలని వాస్తవికంగా కలెక్టర్ భావించి ఫిట్టింగ్ చార్జీలు కూడా తానే ఇస్తానని హామీ ఇచ్చి మరీ నిధులు కేటాయిస్తే.. క్షేత్రస్థాయిలో యంత్రాంగం మాత్రం ఆయన నమ్మకాన్ని వమ్ము చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
నాణ్యత లేని ఫ్యాన్లు, ట్యూబ్లైట్ల వల్ల భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులెవరు? కేవలం కమీషన్ల కోసం చిన్నారుల సౌకర్యాలను తాకట్టు పెట్టిన ఈ నిధుల వేటగాళ్లపై సమగ్ర విచారణ జరిపి, అక్రమార్కుల నుంచి కాజేసిన నిధులను రికవరీ చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు బలంగా కోరుతున్నారు. అలాగే అవినీతి తంతుకు తెరలేపిన వ్యక్తులపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు విన్నవిస్తున్నారు.






