విపత్తు నిర్వహణకు పక్కా ప్రణాళిక అవసరం
విపత్తుల సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
గద్వాల, ఆగస్టు 27 (విజయక్రాంతి): వరదలు, అగ్ని ప్రమాదాలు తదితర విపత్తుల సమయంలో సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సమర్థవంతమైన విపత్తు నిర్వహణకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్షన్ ప్లాన్‌పై అధికారులతో ఆయన సమావేశమయ్యారు. బీచుపల్లి, అలంపూర్, నది అగ్రహారం వంటి నదీ పరివాహక ప్రాంతాల్లో అత్యవసర సమయాల్లో రక్షణ చర్యల కోసం ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
నదుల్లో మునిగిపోయే ఘటనల సమయంలో రక్షణ చర్యలకు గజ ఈతగాళ్లు, మత్స్యకారులకు బోట్లు, లైఫ్ జాకెట్లు, తాళ్లు వంటి పరికరాలు అందుబాటులో ఉంచేందుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. తప్పిపోయిన వ్యక్తులను గుర్తించేందుకు డ్రోన్ కెమెరాలను కొనుగోలు చేయాలని సూచించారు. గద్వాల, అలంపూర్ అగ్నిమాపక కేంద్రాలకు ఆధునిక రెస్క్యూ పరికరాలు సమకూర్చేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. పోలీస్ స్టేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు, కలెక్టరేట్‌లో ఫైర్ సేఫ్టీ పరికరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, డీపీఓ శ్రీకాంత్, అగ్నిమాపక కేంద్రం ఎస్సై రాకేష్, డి సెక్షన్ పర్యవేక్షకులు నరేందర్ తదితరులు పాల్గొన్నారు






