27 August, 2026 | 5:59 PM

ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి

27-08-2026 04:31 PM

2వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలి

సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి

సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల న్యాయపరమైన దీర్ఘకాలిక డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా డిమాండ్ చేశారు. తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్ట్రియాల్ ఉద్యోగుల సంఘం ఇచ్చిన రాష్ట్రవ్యాప్త  ధర్నా కార్యక్రమాల పిలుపులో భాగంగా గురువారం భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట పంచాయతీ కార్యదర్శులు, ఉద్యోగులు చేపట్టిన మహాధర్నాకు ఆయన హాజరై సంపూర్ణ సంఘీభావం ప్రకటించి మాట్లాడారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని, అలాంటి వారి సమస్యలను పరిష్కరించడంలో పాలకులు నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. 2వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేసి ఉద్యోగులను ఆదుకోవాలని కోరారు. ఉద్యోగుల జీవితాలకు భద్రత లేని సీపీఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలని, పూర్తిస్థాయి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్)ను పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన పోరాటాలకు సిపిఐ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.