23 May, 2026 | 2:39 AM

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి

23-05-2026 12:15 AM

 శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాస్

మంచిర్యాల, మే 22 (విజయక్రాంతి) : సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి క్రీడా శిక్షణ పొందిన బాల, బాలికలు భవిష్యత్తులో ప్రతిభావంతమైన క్రీడాకారులుగా జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో రాణించి సింగరేణి సంస్థకు, వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి జీఎం మునిగంటి శ్రీనివాస్ ఆకాంక్షించారు.

శుక్ర వారం శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలోని సీఈఆర్ క్లబ్లో సింగరేణి యాజమాన్యం శ్రీరాంపూర్ ఏరియా ఆధ్వర్యంలో ఏప్రిల్ 25 నుంచి ఈ నెల 20 వరకు నిర్వహించిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థ ప్రతీ ఏడాది వేసవి సెలవులలో కార్మికుల పిల్లల సమయాన్ని సద్వినియోగం చేసే లక్ష్యంతో ఈ క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తుందన్నారు.

శ్రీరాంపూర్ ఏరియా పరిధిలో 25 రోజుల పాటు శిక్షణా కార్యక్రమాలు ప్రగతి స్టేడియం, ప్రాణహిత స్టేడియం, మనోరంజన్ సముదాయాల్లో కొనసాగాయని, ఈ శిబిరాల్లో ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, అథ్లెటిక్స్, బాక్సింగ్ విభాగాలలో మొత్తం 110 మంది బాల, బాలికలు ప్రత్యేక శిక్షణ పొందారన్నారు.

ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల రిక్రియేషన్ కోసం సింగరేణి సంస్థ ప్రతీ ఏరియాలో పెద్ద సంఖ్యలో పార్కులు, స్టేడియంలు, క్లబ్బులు, స్విమ్మింగ్ ఫూల్స్, జిమ్ములు ఇతర క్రీడా వినోద వసతులను ఏర్పాటు చేస్తోందని, ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న చిన్నారులకు క్రీడా దుస్తులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా ఎస్‌ఓ టు జీఎం ఎన్ సత్యనారాయణ, గుర్తింపు సంఘం నాయకులు చంద్రమోహన్, డీజీఎం పర్సనల్ డాక్టర్ ఎస్ అనిల్ కుమార్, క్రీడల గౌరవ కార్యదర్శి కె సృజన్ పాల్, స్పోరట్స్ సూపర్ వైజర్ చాట్ల అశోక్, కోఆర్డినేటర్ సకినాల నర్సయ్య, ఇండోర్ కెప్టెన్ టి సురేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.