సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
డీఎస్పీ శ్రీనివాసరావు
సదాశివనగర్, జులై 26 (విజయక్రాంతి): గ్రామాల్లో సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు అన్నారు. సదాశివనగర్ గ్రామంలోని రైతు వేదికలో ఆదివారం నిర్వహించిన ప్రజా అవగాహన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సమావేశంలో గ్రా మాల్లో నెలకొన్న పరిస్థితులు, శాంతిభద్రతలు, ప్రజల సమస్యలు తదితర అంశాలపై డీఎస్పీ సమగ్ర సమాచారం సేకరించారు. గ్రామాల్లో ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని వివరించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు సైబర్ వారియర్ పీసీ సంజయ్ ద్వారా ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి, ఆన్లైన్ మోసాల నుంచి ఎలా అప్రమత్తంగా ఉండాలో ప్రజలకు వివరించారు.
అదే విధంగా మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, రోడ్డు భద్రతా నియమాల ప్రాముఖ్యత, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలిపారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరాల నివారణ, నేరస్తుల గుర్తింపు, ప్రజల భద్రతకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంటూ ప్రతి గ్రామంలో ఎక్కువ సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సి ఐ సంతోష్ కుమార్, ఎస్ ఐ పుష్పరాజ్, వివిధ గ్రామాల సర్పంచ్ లు, పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






