అవన్నీ సమపాళ్లలో ఉండే ఓ..! సుకుమారి
తిరువీర్, ఐశ్వర్య రాజేవ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఓ..! సుకుమారి’. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర్‌రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. జూలై 17న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత మహేశ్వర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. “ఇది ప్రతి కుటుంబం కలిసి చూసే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.
ఎమోషన్, కామెడీ, వినోదం అన్నీ సమపాళ్లలో ఉంటాయి. సినిమా చాలా బాగా వచ్చింది. ఇందులో చూపించిన ’షాక్’ సమస్యకు కూడా ఒక లాజిక్ ఉంటుంది. నిజానికి ప్రతి మనిషి శరీరంలో ఎలక్ట్రిక్ ఎనర్జీ ఉంటుంది. అయితే అది ఒక్కొక్కరిలో ఒక్కో స్థాయిలో ఉంటుంది. అదే అంశాన్ని కథలో ఆసక్తికరంగా చూపించాం. ఐశ్వర్య రాజేశ్ కోసం దాదాపు మూడు నెలలు ఆగాం. ఆమె ఓకే చెప్పిన తర్వాతే షూటింగ్ ప్రారంభించాం. నేను మొదట నుంచి డిస్ట్రిబ్యూటర్‌ని.
థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా రూపొందించాం. తిరువీర్‌కు తెలుగులో మంచి గుర్తింపు ఉంది. ఐశ్వర్య రాజేశ్ కోసం తమిళంలో కూడా రిలీజ్ చేస్తున్నాం. మంచి కంటెంట్ ఉన్న సినిమా కాబట్టి, థియేటర్లతోపాటు ఓటీటీలోనూ మరింత ఎక్కువ మంది ప్రేక్షకులను చేరుకోవాలనే ఉద్దేశంతో మిగతా భాషల్లో కూడా విడుదల చేస్తున్నాం.
ఈ రోజుల్లో ప్రేక్షకులు ప్రతి రూపాయికి విలువ కోరుకుంటున్నారు. అందుకే ఎక్కడా రాజీ పడకుండా సినిమా రూపొందించాం. పోటీ ప్రతి వారం ఉండేదే. చివరికి మంచి సినిమానే ఆడుతుంది. నేను ఏ కథ విన్నా అందులో కొత్తదనం చూస్తా. ‘ఓ..! సుకుమారి’లోనూ కొత్త కాన్సెప్ట్ ఉంది. అదే నన్ను ఈ సినిమా చేయడానికి ప్రేరేపించింది. -తిరువీర్‌తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాం. సత్యదేవ్‌తో కూడా ఒక ప్రాజెక్ట్ వుంటుంది” అని చెప్పారు.






