లెనిన్ టీమ్‌ను చూస్తే అసూయగా ఉంది!
అఖిల్ అక్కినేని హీరోగా అక్కినేని నాగార్జున, నాగవంశీ నిర్మించిన చిత్రం ‘లెనిన్’. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూలై 10న విడుదలై, ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ క్రమంలో శనివారం చిత్ర యూనిట్ విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్‌లో చిత్ర నిర్మాత నాగార్జున మాట్లాడుతూ.. “తిరుపతిలో ఈవెంట్ అయ్యాక.. స్వామిని దర్శించుకున్నప్పుడు మాత్రం మా వాడికి ఓ హిట్టు ఇవ్వమని అడిగా.
ఆ వెంకటేశ్వరస్వామికి కృతజ్ఞతలు. ‘లెనిన్’ టీమ్‌ను చూస్తే అసూయగా ఉంది. అందరూ ఎంతో ఇష్టపడి, కష్టపడి చేశారు. అఖిల్ చేతికి గాయమై, సర్జరీ పూర్తయి బయటకు వచ్చాక, ఇక గుడ్ టైమ్ వచ్చిందని నాకు అనిపించింది. మా అక్కినేని ఫ్యాన్స్ ‘తండేల్’ వచ్చినప్పుడు ఫ్యాన్స్ కాలర్ ఎగరేశారు. ఇప్పుడు ‘లెనిన్’ విషయంలో కాలర్ ఎగరేస్తున్నారు. మంచి సినిమా ఇస్తే ఆడియెన్స్ హిట్ చేస్తారని ‘లెనిన్’ నిరూపించింది” అన్నారు.
హీరో అఖిల్ అక్కినేని మాట్లాడుతూ “నా వల్ల ఏమైనా సినిమా తేడా కొడుతుందా? అని భయపడ్డా. కంటెంట్ ఉన్న సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ప్రోత్సహిస్తారని మరోసారి నిరూపితమైంది. మళ్లీ నేను ఎక్కువ టైమ్ తీసుకోను. త్వరలోనే మరో కొత్త పాత్ర, కొత్త చిత్రంతో వస్తా” అని చెప్పారు. ‘మేం పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇచ్చిన ఆడియెన్స్కి థాంక్స్’ అని హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అన్నారు.
దర్శకుడు మురళీ కిషోర్ మాట్లాడుతూ.. “యుద్ధమే కాదు.. సక్సెస్‌ను కూడా ప్రశాంతంగా సెలెబ్రేట్ చేసుకుంటున్నా. పదహారేళ్ల తర్వాత నా సొంతూరికి గర్వంగా వెళ్తున్నా. అఖిల్ అంకితభావం వల్లే ఇదంతా సాధ్యమైంది” అన్నారు. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. “లెనిన్’కు ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. నాగార్జున కంట్లోంచి నీళ్లు వచ్చాయి. ఈ సినిమా విజయం సాధించింది అని చెప్పడానికి అంతకంటే ఏం చూపించగలం” అని తెలిపారు.






