అక్రమ సిలిండర్ల వినియోగంపై అధికారుల దృష్టి
* ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దాడులు
ఆదిలాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో గృహ అవసరాల కోసం ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లిస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై అధికారులు ఉక్కుపాదం మోపారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల మేరకు శనివారం జిల్లా కేంద్రంలో సివిల్ సప్లై, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. తనిఖీల సందర్భంగా గృహ వినియోగానికి మాత్రమే అనుమతించిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు వాణిజ్య కార్యకలాపాల్లో వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగిస్తున్న సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ భూస మహేష్ నేతృత్వంలో టీచర్స్ కాలనీ లో రాజస్థాన్‌కు చెందిన వ్యక్తులు బాదం మిల్క్, ఐస్‌క్రీమ్, వివిధ రకాల స్వీట్ల తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు ఈ కేంద్రంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల స్థానంలో తక్కువ ధరకు లభించే గృహ వినియోగ సిలిండర్లను అక్రమంగా వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. స్థానికంగా గ్యాస్ సిలిండర్లను నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న ఓ వ్యక్తిపై అధికారులు చర్యలు తీసుకున్నారు.
అతనిపై 6A సెక్షన్ కింద కేసు నమోదు చేసి సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాయితీపై అందించే గృహ గ్యాస్ సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపార సంస్థల్లో వినియోగించడం చట్టరీత్యా నేరమని అధికారులు హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. వినియోగదారులు నిబంధనలు పాటిస్తూ అధికారులకు సహకరించాలని కోరారు.




