25 February, 2026 | 4:21 AM

ఆక్టోపస్ పంజా

25-02-2026 01:03 AM

16 రాష్ట్రాల్లో.. సైబర్‌క్రైమ్ హాట్‌స్పాట్‌లపై 32 బృందాలతో 10 రోజుల పాటు దాడులు

  1. రూ.127 కోట్ల కుంభకోణాన్ని ఛేదించిన ఆపరేషన్
  2. దేశవ్యాప్తంగా సత్తాచాటిన హైదరాబాద్ పోలీసులు
  3.   1,055 కేసుల్లో ప్రమేయం ఉన్న 104 మంది అరెస్ట్
  4. సైబర్ దొంగలతో బ్యాంకు అధికారుల కుమ్మక్కు
  5. మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, 36 లక్షలు సీజ్

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): రోజురోజుకూ పేట్రేగిపోతున్న సైబర్ నేరగాళ్ల నెట్‌వర్క్‌ను ఛేదించడంలో హైదరాబాద్ పోలీసులు దేశవ్యాప్తంగా మరోసారి సత్తా చాటారు. జాతీయ స్థాయిలో భారీ ఆపరేషన్ చేపట్టి సైబర్ క్రిమినల్స్ సిండికేట్ భరతం పట్టారు. ఆపరేషన్ ఆక్టోపస్ పేరుతో దేశంలోని 16 రాష్ట్రాల్లో ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించి ఏకంగా 104 మందిని అరెస్ట్ చేశారు.

అయితే, ఈ ఆపరేషన్‌లో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. ప్రజల ఆర్థిక భద్రతకు అండగా నిలవాల్సిన బ్యాంకు అధికారులే.. కంచె చేను మేసిన చందంగా సైబర్ దొంగలతో చేతులు కలపడం తీవ్ర కలకలం రేపుతోంది. అమాయక ప్రజలకు కుచ్చుటోపీ పెట్టడంలో నేరగాళ్లకు సహకరించిన పలువురు బ్యాంకు అధికారులను సైతం పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ భారీ కుంభకోణంలో నిందితులు సుమారు రూ.127 కోట్ల మేర మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో నిర్ధారించారు. వీరికి దేశవ్యాప్తంగా నమోదైన 1,055 సైబర్ క్రైమ్ కేసులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

32 బృందాలు.. 16 రాష్ట్రాలు.. సాగిందిలా..

సైబర్ నేరాల మూలాలను వేర్లతో సహా పెకిలించేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పక్కా వ్యూహరచన చేశారు. ముఠాల ఆటకట్టించేందుకు ఏకంగా 32 ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించారు. ఈ బృందాలు వరుసగా 10 రోజుల పాటు మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లోని సైబర్ క్రైమ్ హాట్‌స్పాట్‌లపై ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో మ్యూల్ అకౌంట్ కమీషన్ కోసం అద్దెకు ఇచ్చిన ఖాతాలు హోల్డర్లతో పాటు, సైబర్ నేరాలకు సహకరిస్తున్న మొత్తం 104 మంది కేటుగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. 

రక్షకులే భక్షకులుగా..

ఈ భారీ సైబర్ కుంభకోణంలో కస్టమర్లకు రక్షణ కవచంగా నిలవాల్సిన బ్యాంకు అధికారులే విలన్లుగా మారడం పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది. కష్టార్జితంతో రూపాయి రూపాయి కూడబె ట్టుకున్న ప్రజల సొమ్ము ఏ క్షణంలో కేటుగాళ్ల వశం అవుతుందోనని ఆందోళన చెందుతున్న తరుణంలో, బ్యాంకు ఉద్యోగులే నేరగాళ్లకు సహకరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఖాతాదారులు సైబర్ నేరాల బారిన పడకుండా అవగాహన కల్పించాల్సిన సిబ్బందే.. ముఠా సభ్యులు అక్రమంగా డబ్బులు తరలించేందుకు వీలుగా నకిలీ ఖాతాలు తెరవడంలో సాయం చేసినట్లు తేలింది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను పక్కనపెట్టి ముఠాతో కుమ్మక్కైన బ్యాంకు సిబ్బందిని అరెస్ట్ చేయడంతో, ఇక తమకు దిక్కెవరని సాధారణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆపరేషన్ ఆక్టోపస్ నిరంతర ప్రక్రియ

సైబర్‌నేరాల పట్ల హైదరాబాద్ సిటీ పోలీస్ జీరో టాలరెన్స్ ఏమాత్రం సహించేది లేదనే విధానాన్ని అనుసరిస్తోందని సీపీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఆపరేషన్ ఆక్టోపస్ అనేది ఒక నిరంతర ప్రక్రియ అని, ఈ ముఠాల్లోని ఉన్నత స్థాయి వ్యక్తులను పట్టుకునే వరకు దర్యాప్తు కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు. బ్యాంక్ అధికారులు లేదా మ్యూల్ అకౌంట్ హోల్డర్లు ఎవరైనా సరే.. కమీషన్లకు కక్కుర్తి పడి చట్టాన్ని అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

సైబర్ నేరాల పట్ల నగరవాసులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. ముఖ్యం గా వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా వచ్చే గ్యారెంటీ రిటర్న్స్, ఇన్‌సైడర్ టిప్స్ వంటి ఆఫర్ల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏదైనా ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్ లేదా యాప్‌లో పెట్టుబడి పెట్టే ముం దు అది సెబీ గుర్తింపు పొందిందో లేదో కచ్చితంగా సరిచూసుకోవాలని కోరారు.

ఇక దర్యాప్తు సంస్థల పేర్లతో జరుగుతున్న ‘డిజిటల్ అరెస్ట్’ మోసాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. సీబీఐ, పోలీస్, కస్టమ్స్, ఈడీ తదితర ఏ దర్యాప్తు సంస్థా వీడియో కాల్స్ ద్వారా అరెస్టులు లేదా విచారణలు చేయదని, కేసుల నుంచి పేరు తొలగించేందుకు డబ్బులు బదిలీ చేయమని అడగదని స్పష్టం చేశారు.

భారీగా పట్టుబడిన సొత్తు

ఈ ఆపరేషన్ ఆక్టోపస్ మొత్తం జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఎం విజయ్‌కుమార్, డీసీపీ సైబర్ క్రైమ్స్ వీ అరవింద్‌బాబు పర్యవేక్షణలో అత్యంత పకడ్బందీగా జరిగింది. అరెస్ట్ చేసిన నిందితుల నుంచి పోలీసులు రూ.36 లక్షల నగదుతో పాటు 152 బ్యాంకు పాస్‌బుక్‌లు, 204 మొబైల్ ఫోన్లు, 141 సిమ్ కార్డులు, 234 డెబిట్ కార్డులు, 26 ల్యాప్‌టాప్‌లు, వివిధ డొల్ల సెల్ కంపెనీలకు చెందిన 56 కార్పొరేట్ స్టాంపులను సీజ్ చేశారు. ఈ భారీ ఆపరేషన్‌ను విజయవంతంగా ముగించడంలో అత్యుత్తమ సమర్థతను ప్రదర్శించిన సీసీపీఎస్ అధికారులు, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్లు, ఆర్మ్ రిజర్వ్ సిబ్బందిని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రత్యేకంగా అభినందించారు.