26 August, 2026 | 5:01 AM

నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది నిరసన

26-08-2026 12:00 AM

డిప్యూటీ సూపరింటెండెంట్ తీరుపై తీవ్ర ఆరోపణలు

నాలుగేండ్లుగా భరిస్తున్నాం అంటూ ఆవేదన

నల్లగొండ టౌన్, ఆగస్టు 25: నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది మంగళవారం ఆందోళనకు దిగారు. డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్ తీరుపై నర్సింగ్ ఆఫీసర్లు పలు విమర్శలు చేశారు. నాలుగేళ్లుగా భరిస్తున్న అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

శానిటేషన్, నీటి సౌకర్యం, సెక్యూరిటీ, డ్రెస్సింగ్ చేంజ్, వాష్ రూమ్ ఇలా ఏదీ సక్రమంగా లేకపోయినా అందుకు నర్సింగ్ ఆఫీసర్లను బాధ్యులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోగుల పట్ల, పేషంట్లతో మాట్లాడే విధానంలో ప్రేమగా ఉండాలని చెప్పే డిప్యూటీ మెడికల్ చూ పాండెంట్ తోట ఎంప్లాయిస్ పట్ల, మహిళా ఉద్యోగులతో ‘రావే, పోవే, బలిసిందా‘ అంటూ ఏకవచనంతో అసభ్యంగా మాట్లాడుతూ మనోవేదనకు గురి చేస్తున్నారని నర్సింగ్ ఆఫీసర్లు ఆరోపించారు.

పేషెంట్ల పట్ల ప్రేమగా మాట్లాడాలని నీతులు చెప్పే అధికారులే ఉద్యోగుల పట్ల దురుసుగా వ్యవహరించడాన్ని ప్రశ్నించారు.ఈ నెలలోనే 14 మంది మహిళా నర్సింగ్ ఆఫీసర్లకు మెమోలు జారీ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుచిత వ్యాఖ్యలు, మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని వాపోయారు. నాలుగేళ్లుగా భరిస్తున్నాం.. ఇక భరించలేక బయటకు వచ్చాం అని నర్సింగ్ సిబ్బంది తెలిపారు.నర్సింగ్ సిబ్బంది సమస్యలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు తేల్చాలని, తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.