బైపాస్ కాదు.. మృత్యుమార్గం!
- చారకొండలో ఆగని రోడ్డు ప్రమాదాలు
- బ్యారికెడ్లు తొలగించడంతో మళ్లీ పెరిగిన వేగం
- నెల రోజుల్లోనే మరో ప్రాణం బలి
- తాజాగా లారీ బీభత్సంతో మరోసారి బహిర్గతమైన నిర్లక్ష్యం
- ఇంకెన్ని ప్రమాదాలు జరిగితే అధికారులు మేల్కొంటారు?
చారకొండ, జూన్ 5: ప్రయాణికుల సురక్షిత ప్రయాణం కొరకు ఏర్పాటు చేసిన బైపాస్ రహదారి ఇప్పుడు ప్రాణాలను బలిగొంటున్న మృత్యుమార్గంగా మారింది. కోట్ల వ్యయంతో నిర్మించిన కోదాడజడ్చర్ల జాతీయ రహదారి బైపాస్పు వరుస మరణాలు చోటు చేసుకుంటుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపం, చెరుకుపల్లి, బ్రాహ్మణపల్లి చౌరస్తా ప్రాంతాలు ప్రమాదాలకు హాట్ స్పాట్ లుగా మారాయి. నిత్యం ఏదో ఒక ప్రమాదం, పలువురు గాయాలు, కుటుంబాల్లో ఆందోళనలతో బైపాస్ రహదారి భయానక రూపం దాల్చింది.
విజయక్రాంతి హెచ్చరించినా పట్టించుకోని అధికారులు.
బైపాస్పు పెరుగుతున్న ప్రమాదాలపై ఏప్రిల్ 13న ‘విజయక్రాంతి’ ప్రత్యేక కథనం ప్రచురించి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను హెచ్చరించింది. దీనికి స్పందించిన ఎస్త్స్ర వీరబాబు చెరుకుపల్లి చౌరస్తా వద్ద బ్యారికెడ్లు ఏర్పాటు చేయడంతో కొంతకాలం పాటు వాహనాల వేగం తగ్గి ప్రమాదాలు కూడా నియంత్రణలోకి వచ్చాయి. అయితే బక్రీద్ పండుగ సందర్భంగా పోలీసు చెక్పోస్టు కోసం ఆ బ్యారికెడ్లను తొలగించడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చిందని వాహనదారులు వాపోయారు. ప్రస్తుతం వాహనాలు అత్యధిక వేగంతో దూసుకుపోతుండటంతో ప్రమాదాలు మళ్లీ పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాణాలు పోతున్నా కదలని యంత్రాంగం.
నెల రోజుల వ్యవధిలోనే బైపాస్పు పదుల సంఖ్యలో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా చెరుకుపల్లి చౌరస్తా, జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో తరచూ ప్రమాదాలు నమోదవుతున్నాయి. గత నెల 28న జరిగిన ప్రమాదంలో చారకొండకు చెందిన అల్లాజీ ప్రాణాలు కోల్పోగా, కల్వకుర్తి మండలం జంగారెడ్డిపల్లికి చెందిన ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి ప్రాణం పోయినా, పలువురు గాయపడినా సంబంధిత శాఖలు శాశ్వత చర్యలు చేపట్టకపోవడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజా ప్రమాదం... తృటిలో తప్పిన భారీ విషాదం.
గురువారం ఉదయం జరిగిన లారీ ప్రమాదం బైపాస్పు నెలకొన్న ప్రమాదకర పరిస్థితులను మరోసారి వెలుగులోకి తెచ్చింది. కల్వకుర్తి వైపు నుంచి దేవరకొండ దిశగా చక్కెర లోడుతో వెళ్తున్న లారీ జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలోని స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపు తప్పింది. ఎదురుగా వస్తున్న అశోక్ లేలాండ్ ఆటో ట్రక్కును ఢీకొట్టిన లారీ, అనంతరం ముందుగా వెళ్తున్న కారును బలంగా ఢీకొట్టి చివరకు కారుపైనే బోల్తా పడింది.
ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ భయానక వాతావరణం నెలకొంది. ఆటోలో ప్రయాణిస్తున్న గోకారం గ్రామానికి చెందిన జమ్ముల బొజ్జమ్మకు చేయి విరగగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాద సమయంలో రహదారి పక్కన ఉన్నవారు, కారులో ప్రయాణిస్తున్న వారు వెంట్రుకవాసిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. లారీ కొద్దిదూరం ఎడమవైపు దూసుకెళ్లి ఉంటే భారీ ప్రాణనష్టం సంభవించేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ప్రమాదాలకు కారణం ఎవరు?.
స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసినప్పటికీ వాటి గురించి ముందస్తు హెచ్చరిక బోర్డులు లేకపోవడం, రాత్రివేళల్లో కనిపించే రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయకపోవడం, ప్రమాదాలు తగ్గించిన బ్యారికెడ్లను తిరిగి పునరుద్ధరించకపోవడం వంటి అంశాలే ప్రమాదాలకు ప్రధాన కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసినా పోలీసులు, జాతీయ రహదారి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.
గ్రామం గుండా రహదారి విస్తరణ చేయాలని ప్రజలు కోరినప్పుడు ‘ప్రమాదాలు జరుగుతాయి‘ అనే కారణంతో బైపాస్ నిర్మించిన అధికారులు, ఇప్పుడు అదే బైపాస్పు వరుస ప్రమాదాలు జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ప్రాణాలు పోతున్నా, ప్రజలు గాయపడుతున్నా అధికార యంత్రాంగం మౌనంగా ఉండటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తక్షణమే చేపట్టాల్సిన చర్యలు..
- తొలగించిన బ్యారికెడ్లను వెంటనే పునరుద్ధరించాలి.
- చెరుకుపల్లి, బ్రాహ్మణపల్లి చౌరస్తాల్లో శాశ్వత వేగ నియంత్రణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి.
- స్పీడ్ బ్రేకర్ల వద్ద హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలి.
- జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో విద్యార్థుల భద్రత కోసం జీబ్రా క్రాసిం గ్లు, ఫ్లాషింగ్ సిగ్నళ్లు ఏర్పాటు చేయాలి.
ప్రమాదాలపై ప్రత్యేక అధ్యయనం చేసి శాశ్వత భద్రతా చర్యలు చేపట్టాలి. ప్రమాదం జరిగిన ప్రతిసారి అధికారులు హడావుడిగా స్పందించి, కొద్ది రోజుల్లోనే మళ్లీ మౌనం పాటించడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇంకెన్ని ప్రమాదాలు జరిగితే అధికారులు మేల్కొంటారు? ఇంకెన్ని ప్రాణాలు పోతే శాశ్వత పరిష్కారం చూపుతారు?‘ అనే ప్రశ్న ఇప్పుడు చారకొండ ప్రజల నోట వినిపిస్తోంది. బైపాస్పు భద్రతా చర్యలు చేపట్టకపోతే మరిన్ని విషాదాలు తప్పవని ప్రజలు హెచ్చరిస్తున్నారు.






