పీఆర్సీ నివేదికపై ఆలస్యం వద్దు
వెంటనే విడుదల చేయాలి: టీజీఈజేఏసీ
హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల సవరణకు సంబంధించిన పీఆర్సీ నివేదికను వెంటనే విడుదల చేయాలని టీజీఈజేఏసీ కోరింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ రామకృష్ణకు టీజీఈజేఏసీ చైర్మన్ మారం జేగదీష్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్ లేఖ రాసి తమ ఆందోళనలను తెలియజేశారు. 2023లో ఏర్పాటు చేసిన పీఆర్సీ కమిటీ ఇప్పటికే ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను సేకరించి సమీక్ష పూర్తి చేసినప్పటికీ, ఇప్పటివరకు నివేదిక విడుదల కాలేదని జేఏసీ పేర్కొంది.
దీంతో ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతోందని తెలిపింది. ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఉ ద్యోగుల ఆదాయం-ఖర్చుల మధ్య భారీ అం తరం ఏర్పడిందని లేఖలో పేర్కొన్నారు. పిల్ల ల విద్య, వైద్యం, గృహ రుణాల ఈఎంఐలు వంటి అవసరాలను తీర్చుకోవడం కష్టమైందని, చాలా మంది ఉద్యోగులు నెలకు సుమారు రూ.20 వేల వరకు లోటుతో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పీఆర్సీ సిఫార్సులు 2024 ఏప్రిల్ నాటికే రావాల్సి ఉన్నప్పటికీ, ఆలస్యం కారణంగా ఉద్యోగులు తమ హక్కులను కోల్పోతున్నారని జేఏసీ అభిప్రాయపడింది. అందువల్ల ఇకపై ఆలస్యం చేయకుండా వెంటనే నివేదికను విడుదల చేసి అమలు చేయాలని, గడువును మరింత పొడిగించవద్దని ప్రభుత్వాన్ని కోరింది.




