calender_icon.png 12 February, 2026 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవశకం!

12-02-2026 02:25:52 AM

మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ

  1. హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లు
  2.    12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వవ్యవస్థీకరణ 
  3. మూడు కార్పొరేషన్లకు కమిషనర్ల నియామకం
  4. సమన్వయం కోసం ప్రత్యేక అధికారిగా జయేష్ రంజన్

హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): విశ్వనగరంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగర పాలనలో చారిత్రాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. నగర ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన పౌర సేవలను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కోర్ అర్బన్ రీజియన్  పునర్వవ్యవస్థీకరణ ప్రక్రియ అధికారికంగా అమ ల్లోకి వచ్చింది.

దశాబ్దాలుగా ఏకచ్ఛత్రాధిపత్యంగా కొనసాగుతున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వ్యవస్థను సమూలంగా మారుస్తూ, దానిని మూడు స్వతంత్ర కార్పొరేషన్లుగా విభజిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా జీహెచ్‌ఎంసీతో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లుగా విభజించి కమిషనర్లను నియమించారు.  మెట్రోపాలిటన్ ఏరి యా అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ బుధవారం జారీ చేసిన జీవో ఎంఎస్ నెం. 55 ద్వారా ఈ నూతన విధానం అమలులోకి వచ్చినట్లు ప్రకటించింది. ఈ ఉత్తర్వులు వెలువడిన వెంటనే పరిపాలనా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన కదిలింది. 

త్రీ ఇన్‌వన్.. ప్రత్యేక అధికారిగా జయేష్ రంజన్ 

నగర పాలనను మూడు ముక్కలుగా విభజించినప్పటికీ, పరిపాలనలో ఎక్కడా సమన్వయ లోపం తలెత్తకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే అత్యంత సీనియర్ ఐఏఎస్ అధికారి, మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయే ష్ రంజన్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది. నూతనంగా ఏర్పాటైన గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లు మూడింటికీ ఆయనను ప్రత్యేక అధికారిగా నియమించింది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం ఆయన ట్యాంక్ బండ్‌లోని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకొని బాధ్యతలు స్వీకరించారు. సుదీర్ఘకాలం పాటు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖలకు సారథ్యం వహించి, రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన జయేష్ రంజన్.. ప్రస్తుతం పట్టణాభివద్ధి శాఖ బాధ్యతల్లో ఉం డటంతో ఈ విభజన ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించగలరని ప్రభు త్వం భావిస్తోంది. ఆయన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఇతర ఉన్నతాధికారులు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

కొలువుదీరిన ముగ్గురు కమిషనర్లు 

కార్పొరేషన్ల విభజన నేపథ్యంలో, మూడు వేర్వేరు పాలక మండళ్లకు సంబంధించి ప్రభుత్వం నియమించిన ముగ్గురు కమిషనర్లు కూడా బుధవారమే తమ బాధ్యతలను స్వీకరించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్ యథావిథిగా కొనసాగుతూ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన సచివాలయంలో  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకష్ణారావును మర్యాదపూర్వకం గా కలిశారు. మరోవైపు, కొత్తగా ఏర్పాటైన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారిణి జి. సృజన, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా టి. వినయ్ కృష్ణారెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు.

ప్రజలకు మరింత చేరువకానున్న పాలన 

గతంలో సుదూర ప్రాంతాల నుంచి ప్రధాన కార్యాలయానికి రావాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. తాజా పునర్వవ్యవస్థీకరణతో ప్రతి కార్పొరేషన్‌కు ప్రత్యేక కమిషనర్, జోనల్ కమిషనర్లు అందుబాటులోకి వచ్చారు. వార్డుల సంఖ్యను 300కు పెంచడం, సర్కిళ్ల సంఖ్యను 60కి చేర్చడం ద్వారా ప్రతి 50 వేల జనాభాకు ఒక వార్డు, లేదా ప్రతి 5 వార్డులకు ఒక సర్కిల్ ఉండేలా విభజన చేసినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా బడంగ్‌పేట్, నిజాంపేట్, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, బండ్లగూడ జాగీర్ వంటి నగరపాలక సంస్థలు, పలు మున్సిపాలిటీలను ఈ మూడు కార్పొరేషన్లలో విలీనం చేయడంతో గ్రేటర్ హైదరాబాద్ భౌగోళిక స్వరూపం మారిపోయింది. ఈ కొత్త వార్డులు, సర్కిళ్ల ఏర్పాటుతో క్షేత్రస్థాయిలో వేగంగా సమస్యల పరిష్కారం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

మల్కాజిగిరి కార్పొరేషన్...

ఉప్పల్, ఎల్బీనగర్ వంటి జనసాంధ్రత కలిగిన ప్రాంతాలతో పాటు, అవుటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించిన ప్రాంతాలతో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్’ను ఏర్పాటు చేశారు. దీని పరిధిలో 3 జోన్లు, 14 సర్కిళ్లు, 74 వార్డులు ఉన్నాయి.

దీని పరిధిలోని జోన్లు ఇవే:

మల్కాజిగిరి జోన్: కీసర జవహర్‌నగర్, దమ్మాయిగూడ సహా, అల్వాల్, బోయిన్‌పల్లి, మల్కాజిగిరి, మౌలాలి.

ఉప్పల్ జోన్: ఘట్‌కేసర్ పోచారం సహా, కాప్రా, నాచారం, ఉప్పల్, బోడుప్పల్ పీర్జాదిగూడ.

ఎల్బీనగర్ జోన్: నాగోల్, సరూర్ నగర్, ఎల్బీనగర్, హయత్‌నగర్ వనస్థలిపురం, పెద్ద అంబర్‌పేట్.

సింహభాగం ‘హైదరాబాద్’ కార్పొరేషన్‌దే.. 

నగర నడిబొడ్డున ఉన్న కోర్ సిటీ ప్రాంతంతో పాటు, పాతబస్తీ, పరిసర ప్రాంతాలను కలుపుకుని ఏర్పాటు చేసిన ‘హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్’ పరిపాలనా పరంగా అతిపెద్దదిగా నిలిచింది. దీని పరిధిలో 6 జోన్లు, 30 సర్కిళ్లు, ఏకంగా 150 వార్డులు ఉన్నాయి.

ఈ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే జోన్లు..

శంషాబాద్ జోన్: ఇందులో ఆదిభట్ల, బడంగ్‌పేట్, జల్‌పల్లి, శంషాబాద్ సర్కిళ్లు ఉన్నాయి. బడంగ్‌పేట్, మీర్‌పేట్, బాలాపూర్ వంటి ప్రాంతాలు ఇందులో విలీనమయ్యాయి.

రాజేంద్రనగర్ జోన్: రాజేంద్రనగర్, అత్తాపూర్, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట. 

చార్మినార్ జోన్: చార్మినార్, సంతోష్‌నగర్, యాకుత్‌పురా, మలక్‌పేట్, మూసారాంబాగ్.

గోల్కొండ జోన్: గోల్కొండ, గోషామహల్, కార్వాన్, మెహిదీపట్నం, మాసబ్ ట్యాంక్.

ఖైరతాబాద్ జోన్: అత్యంత కీలకమైన ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ సహా, బోరబండ, యూసఫ్‌గూడ, అమీర్‌పేట్.

సికింద్రాబాద్ జోన్: కవాడిగూడ, ముషీరాబాద్, అంబర్‌పేట్, తార్నాక, మెట్టుగూడ.

సైబరాబాద్ కార్పొరేషన్..

హైదరాబాద్ ఆర్థిక ప్రగతికి ఇంజిన్‌లాంటి ఐటీ కారిడార్, పారిశ్రామిక ప్రాంతాలు, వేగంగా విస్తరిస్తున్న శివారు ప్రాంతాలతో  సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైంది. దీని పరిధిలో 3 జోన్లు, 16 సర్కిళ్లు, 76 వార్డులు ఉన్నాయి.

దీని పరిధిలోని జోన్లు ఇవే..

సైబరాబాద్ జోన్: నార్సింగి కోకాపేట, గండిపేట సహా, పటాన్‌చెరు, అమీన్‌పూర్, మియాపూర్, సెరిలింగంపల్లి గచ్చిబౌలి, నల్లగండ్ల.

కూకట్‌పల్లి జోన్: మాదాపూర్ హైటెక్ సిటీ సహా, ఆల్విన్ కాలనీ, కూకట్‌పల్లి, మూసాపేట్.

కుత్బుల్లాపూర్ జోన్: చింతల్, జీడిమెట్ల, కొంపల్లి, గాజులరామారం, నిజాంపేట్, దుండిగల్, మేడ్చల్. ముఖ్యంగా మేడ్చల్, దుండిగల్, నిజాంపేట్ వంటి ప్రాంతాలు కలవడంతో ఈ కార్పొరేషన్ విస్తీర్ణం భారీగా పెరిగింది.