భాగ్యనగర్ తండా ఉపాధి హామీ పనుల్లో తీవ్ర నిర్లక్ష్యం
రూ.300 లేకపోతే పని లేదా? NREGSలో భారీ అక్రమాలు
ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోవడంతో రెచ్చిపోతున్న మెట్లు
ఉపాధి హామీ పనులు అంటే ఫోటో లు దిగడమేనా
మిర్చి రైతుల ఆవేదన
కారేపల్లి,(విజయక్రాంతి): భాగ్యనగర్ తండాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో అధికారుల నిర్లక్ష్యం, తీవ్రమైన అక్రమాలు, జరుగుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఉపాధి పనులకు వెళ్లాలంటే ప్రతి వారం కార్మికుల నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారని ఉపాధి కార్మికులు చెబుతున్నారు. ప్రభుత్వం పేదలకు ఉపాధి కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఈ పథకం, స్థానిక స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోవడంతో ఇదే అదునుగా చేసుకున్న కొంతమంది మెట్లు అవినీతి దారులు ఎత్తుకొని కార్మికుల నుండి ప్రతివారం 200 నుంచి 300 రూపాయలు వసూలు చేస్తూ ఎటువంటి పనులు చేయాల్సిన అవసరం లేదని
ఫోటోలు దిగి వెళ్లిపోవాల్సిందిగా వారికి తెలుపుతూ ఉదయం ఒకసారి సాయంత్రం 5 గంటలకు ఓసారి ఫోటోలో దింపుతూ పనులు చేయనీయకుండా తీవ్ర నష్టాన్ని కలిగిస్తు లక్ష్యానికి విరుద్ధంగా ఉపాధి హామీ పథకం మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధి హామీకి సంబంధించిన అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనుల కేటాయింపు, హాజరు నమోదు (మస్టర్ రోల్స్) వంటి అంశాల్లో అనుమానాస్పద పరిస్థితులు నెలకొన్నాయి.
డబ్బులు చెల్లించని వారికి పనులు ఇవ్వడం లేదని, ఇలాంటి ఒత్తిళ్లతో నిజంగా ఉపాధి కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని కార్మికులు వాపోతున్నారు. ఉపాధి హామీ పథకాన్ని వసూళ్ల పథకంగా మార్చేసిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఉపాధి హామీ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని కోరుతున్నారు.
మిర్చి రైతుల ఆవేదన...
ఉపాధి హామీ పనులు ప్రారంభం కావడంతో వ్యవసాయ పనులకు కూలీలు దొరకడం రైతులకు పెద్ద సమస్యగా మారింది.రోజంతా కష్టపడితే వచ్చే దానికంటే ఏమాత్రం పనులు చేయకుండా ఫోటోలు దిగితేనే ఉపాధి హామీలో డబ్బులు వస్తున్నాయి అంటూ కూలీలు పొలాలకు రావడం తగ్గిపోయింది.దీంతో నెలల తరబడి చెమటోడ్చి పెంచిన మిర్చి పంట కోతల పనులు నిలిచిపోయి రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు. అప్పులు, పెట్టుబడులు, కూలీల కొరతతో అన్నదాతలు నానా ఇబ్బందులు పడుతున్నారు.






