31 July, 2026 | 1:27 AM

ఫైనల్లో నీరజ్ చోప్రా

31-07-2026 12:04 AM
  1. స్వర్ణానికి అడుగే దూరం
  2. తుది పోరుకు యశ్వీర్ సింగ్, రోహిత్ యాదవ్ 
  3. నేడు అర్థరాత్రి తర్వాత ఫైనల్

భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా కామన్‌వెల్త్ గేమ్స్ ఫైనల్‌కు దూసుకెళ్ళాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఐదో స్థానంలో నిలిచి తుది పోరుకు అర్హత సాధించాడు. నీరజ్‌తో పాటు మరో ఇద్దరు అథ్లెట్లు యశ్వీర్ సింగ్, రోహిత్ యాదవ్ కూడా ఫైనల్లో అడుగుపెట్టారు. టైటిల్ పోరులో నీరజ్ చోప్రా, పాక్ అథ్లెట్ నదీమ్ , శ్రీలంకకు చెందిన రుమేశ్ మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.

గ్లాస్గో, జూలై 30 : కామన్వెల్త్ గేమ్స్‌లో భారీ అంచనాలు పెట్టుకున్న జావెలిన్ త్రో లో భారత్‌కు శుభారంభం లభించింది. ఒ లింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రాతో పాటు రోహిత్ యాదవ్, యశీ వీర్ సింగ్ ముగ్గు రూ పురుషుల జావెలిన్ త్రో ఫైనలు దూసుకెళ్లారు.. బలమైన గాలుల కారణంగా అథ్లెట్ల కు త్రో విసరడం కష్టంగా మారినా, అత్యుత్తమ ప్రదర్శన చేసిన 12 మంది ఫైనల్‌కు క్వాలిఫై అయ్యారు. ఈ అర్హత పోటీలో ఆటోమేటిక్ క్వాలిఫికేషన్ దూరమైన 84 మీటర్ల ను ఏ అథ్లెట్ అందుకోలేకపోయాడు. నీరజ్ చోప్రా తన రెండో ప్రయత్నంలో 79.61 మీ టర్లు విసిరి ఐదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరాడు. అప్పటికే అర్హత ఖరారవడంతో చివరి ప్రయత్నాన్ని ఉపయోగించుకోలేదు.

రోహిత్ యాదవ్ 78.37 మీటర్లు విసిరి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. యశ్వేర్ సింగ్ 78.36 మీటర్లుతో పదో స్థానంలో నిలిచాడు. గతేడాది సెప్టెంబర్ నుంచి నీరజ్ చోప్రా గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ కారణంగానే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో ఆశించిన మేర రాణించలేక ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. గాయం కారణంగానే ఈ ఏడాది సీజన్ ను కూడా ఆలస్యంగా ప్రారంభించాడు. జూన్లో జరిగిన దోహా డైమండ్ లీగ్‌లో ఒక్కసారి మాత్రమే బరిలోకి దిగి 85.69 మీటర్లు విసిరి నాలుగో స్థానంలో నిలిచాడు.

ఇదిలా ఉంటే గ్లాస్గో క్వాలిఫికేషన్ రౌండ్‌లో శ్రీలంక అథ్లెట్ రుమేశ్ పతిరాజే 82.84 మీటర్లు విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో అతని పేరిట ప్రపంచంలోనే అత్యుత్తమ త్రో 92.62 మీటర్లు ఉంది. గ్రెనడాకు చెందిన రెండుసార్ల ప్రపంచ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్ 81.29 మీటర్లతో రెండో స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా అథ్లెట్ డౌ స్మిట్ 80.64 మీటర్లలో మూడో స్థానం దక్కించుకున్నాడు. ఒలింపిక్ ఛాంపియన్ , పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ 78.63 మీ. దూరం విసిరి ఏడో స్థానంతో ఫైనల్లో అడుగుపెట్టాడు. శుక్రవారం అర్థరాత్రి తర్వాత జరిగే ఫైనల్లో శ్రీలంక అథ్లెట్ రూపేశ్, భారత్ స్టార్ నీరజ్ చోప్రా, పాక్ అథ్లెట్ నదీమ్ మధ్యనే తీవ్ర పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు.