18 March, 2026 | 7:48 PM

విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలి

18-03-2026 05:57 PM

- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

బెల్లంపల్లి,(విజయక్రాంతి): 10వ తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్షా కేంద్రాలలో తగిన సౌకర్యాలు కల్పించాలని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలోగల బజార్ ఏరియాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని సందర్శించి పరీక్ష తీరును పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి వార్షిక పరీక్షల నిమిత్తం జిల్లాలో 48 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యార్థుల సౌకర్యార్థం త్రాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, వెలుతురు, ఫ్యాన్లు, మూత్రశాలలు, అత్యవసర నిమిత్తం అవసరమైన మందులు, వైద్య సిబ్బంది నియమించడం జరిగిందన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.

- కేజీబీవీ సందర్శన...

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మున్సిపల్ కమిషనర్ సంపత్ తో కలిసి సందర్శించి అదనపు తరగతి గదులు, భోజనశాల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 9వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పాఠ్యాంశాలలో వారి అభ్యాసనా సామర్ధ్యాలను పరీక్షించారు. విద్యార్థుల కొరకు వేసవిలో సమ్మర్ క్యాంప్ లు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిబిరాలలో పాటలు, ముత్యాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. రామ్ నగర్ ప్రాంతంలో నిర్మితమవుతున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నిర్మాణ పనులను సందర్శించి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన  కన్నేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 10వ తరగతి వార్షిక పరీక్షల పరీక్షా కేంద్రాన్ని సందర్శించి పరీక్ష తీరును పరిశీలించారు.

అక్కడి నుంచి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్లారు. పారిశుధ్య నిర్వహణ, తరగతి గదులు, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలని సూచించారు.  పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యా బోధన వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించి ఉద్యోగులు, సిబ్బంది విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విధులలో సమయపాలన పాటించాలని చెప్పారు. 

- టైపిస్టుకు షోకాజ్..

కార్యాలయం లో పనిచేస్తున్న టైపిస్ట్ ఎలాంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  వి పట్ల నిర్లక్ష్యంగా ఉన్న  టైపిస్ట్కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ అధికారిని ఆదేశించారు. మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి ప్రహరీ గోడ, భోజన శాల నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. పాఠశాలలోని భోజనశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మెనూ పరిశీలించారు. విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలని తెలిపారు. ఆర్.ఓ. ప్లాంట్ ను పరిశీలించి విద్యార్థులకు శుద్ధమైన త్రాగునీటిని అందించాలన్నారు.