15 August, 2026 | 4:55 PM

సైనికుడి చేతుల మీదుగా త్రివర్ణ పతాకం

15-08-2026 04:02 PM

కొత్తగూడెం విలేఖరుల వినూత్న సెల్యూట్

వీఐపీ సంస్కృతికి భిన్నంగా.. దేశ రక్షకుడికి గౌరవం...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కొత్తగూడెం విలేఖరులు ప్రత్యేక సందేశాన్ని చాటిచెప్పారు. ఆగస్టు 15న కొత్తగూడెం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన జాతీయ పతాక కార్యక్రమంలో పలు కీలక సైనిక ఆపరేషన్లతో పాటు అబ్దుల్ కలాంకు పర్సనల్ టీంలో పాల్గొన్న రిటైర్డ్ ఆర్మీ అధికారి మెరైన్ కమాండ్ ఫోర్సుకు  చెందిన కొత్తగూడెం బిడ్డ వేముల సతీష్ కుమార్ చేతుల మీదుగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. మెరైన్ కమాండ్ ఫోర్సులో తెలంగాణ నుంచి నలుగురు ఉండగా అందులో మన కొత్తగూడెం జిల్లా నుంచి ఏకైక వ్యక్తి సతీష్ కావడం మన గర్వకారణం. దేశ సరిహద్దుల్లో సేవలందించిన మాజీ సైనికుడిని స్వాతంత్ర్య వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించి గౌరవించడం కొత్తగూడెం ప్రెస్ క్లబ్బులో కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణంగా వీఐపీలకు ప్రాధాన్యం ఇచ్చే కార్యక్రమాలకు భిన్నంగా, దేశం కోసం సేవ చేసిన సైనికుడికి గౌరవం ఇవ్వాలనే నిర్ణయాన్ని విలేఖరులు తీసుకున్నారు. సైనికుడి చేతిలో జెండా.. బలమైన సందేశం....

స్వాతంత్ర్యం కోసం ఎందరో త్యాగాలు చేశారు. స్వాతంత్ర్యం అనంతరం దేశ సరిహద్దులను కాపాడేందుకు సైనికులు నిరంతరం సేవలందిస్తున్నారు. అలాంటి సైనికుడి చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఎగురవేయించడం ద్వారా ఆయన సేవలకు గౌరవం తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ గీతాలాపన నిర్వహించి, దేశ రక్షణలో సేవలందించిన సైనికులకు, అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రిపోర్టర్లు పాల్గొన్నారు.