యాదాద్రి భువనగిరి జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ఆలేరు, ఆగస్ట్ 15 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri district) కేంద్రంలోని జూనియర్ కళాశాల ప్రాంగణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరులకు నివాళులర్పిస్తూ, వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర, జిల్లా అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
రైతు భరోసా, రైతు బీమా, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, సాగునీటి ప్రాజెక్టులు, చేయూత పెన్షన్లు, విద్య, వైద్యం తదితర రంగాల్లో సాధించిన ప్రగతిని వెల్లడించారు. జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపేందుకు సమష్టిగా కృషి చేయాలని కోరారు. విద్యార్థుల దేశభక్తి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విధుల్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అక్షాంశ్ యాదవ్, అదనపు కలెక్టర్లు భాస్కర్ రావు, వెంకారెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీ వాణి, వైస్ చైర్మన్ మంజుల, గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తీ, జడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






