15 August, 2026 | 5:48 PM

మాట ఇచ్చారు..బస్సు తెచ్చారు

15-08-2026 04:53 PM

బాలుడి విజ్ఞప్తికి హామీ ఇచ్చిన మంత్రి ,ఎమ్మెల్యే.. 

నెరవేర్చిన ఆర్టీసీ అధికారులు

కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు

కల్లూరు, ఆగస్టు 15(విజయ క్రాంతి): స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి గ్రామ ప్రజలకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక కానుక అందించారు.ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్రామానికి శనివారం మధిర డిపో నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించారు.ఎర్రబోయినపల్లి మీదుగా కల్లూరుకు బస్సు నడపడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.ఇటీవల కల్లూరులో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎర్రబోయినపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని ఓ బాలుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్‌ను కోరారు.

బాలుడి విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి,ఎమ్మెల్యే వెంటనే ఆర్టీసీ అధికారులతో మాట్లాడి గ్రామానికి బస్సు సర్వీసు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.వారి ఆదేశాల మేరకు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఏ. శ్రీరామ్ సూచనలతో మధిర డిపో మేనేజర్ దేవరాజ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పంద్రాగస్టు రోజున గ్రామానికి బస్సు నడిపేలా చర్యలు చేపట్టి, శనివారం ఎర్రబోయినపల్లి మీదుగా కల్లూరుకు ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించారు.గ్రామానికి తొలిసారిగా బస్సు రావడంతో గ్రామస్తులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.గ్రామ పెద్దలు,పుర ప్రముఖులు బస్సుకు ఘన స్వాగతం పలికి ఆర్టీసీ అధికారులను అభినందించారు.

ఈ సందర్భంగా డిపో మేనేజర్ దేవరాజ్‌ను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా డిపో మేనేజర్ దేవరాజ్ మాట్లాడుతూ.. బస్సు రాకపోకలు నిర్వహించే సమయాల్లో గ్రామస్తులు ఆటోలను ఆశ్రయించకుండా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి సర్వీసును ఆదరించాలని కోరారు.గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించేందుకు కృషి చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి,ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్,ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఏ. శ్రీరామ్,మధిర డిపో మేనేజర్ దేవరాజ్‌లకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ దొడ్డపునేని శ్రీనివాసరావు,మాజీ ఎంఈఓ కాకర్ల రంగారావు, నల్లగట్ల పుల్లయ్య,గూడ జోజి, రేపాకుల రామకృష్ణ,బీరవల్లి రవి, కొడవటి అంజయ్య,కృష్ణమూర్తి, మేకల వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.