15 August, 2026 | 5:44 PM

సమానత్వం, సామాజిక న్యాయంతోనే సమగ్ర అభివృద్ధి

15-08-2026 04:46 PM

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి

నాగర్‌ కర్నూల్, ఆగస్టు 15 ( విజయక్రాంతి): 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు దోహదపడిన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం ఆధారంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ పేదలు, మహిళలు, రైతులు, యువత, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు స్వర్గీయ సినిమా శేఖరయ్య సతీమణి అంబటి లీలావతిని సత్కరించారు. విద్యార్థులు నిర్వహించిన దేశభక్తి, స్వాతంత్ర్య పోరాట ఘట్టాలపై సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉత్తమ ప్రదర్శనలకు బహుమతులు అందజేశారు. వివిధ శాఖల ఉత్తమ సేవలందించిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించారు.