కేసముద్రం మండలానికి అరుదైన గౌరవం
ఇద్దరు వ్యవసాయ అధికారులకు జిల్లా స్థాయి ప్రశంసలు
రైతు సేవలో విశేష కృషికి గుర్తింపు
మహబూబాబాద్, (విజయక్రాంతి): స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన అధికారులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కేసముద్రం మండలానికి చెందిన ఇద్దరు వ్యవసాయ అధికారులు జిల్లా స్థాయిలో ప్రశంసా పత్రాలు అందుకోవడం విశేషంగా నిలిచింది. జిల్లా స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రాంచందర్ నాయక్ , కలెక్టర్ స్నేహ శబరిష్, జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర చేతుల మీదుగా ఇద్దరు అధికారులు ప్రశంసా పత్రాలు అందుకున్నారు.
కొత్తగూడ మండల వ్యవసాయ అధికారిగా విధులు నిర్వహిస్తున్న కేసముద్రం మండలం దనసరి గ్రామానికి చెందిన జక్కుల ఉదయ్, అలాగే డోర్నకల్ మండల వ్యవసాయ అధికారిగా విధులు నిర్వహిస్తున్న కర్పూరపు అనిల్ కుమార్ ఇరువురు అధికారులు రైతుల సంక్షేమమే లక్ష్యంగా అంకితభావంతో పనిచేస్తూ, ప్రభుత్వ వ్యవసాయ పథకాలను రైతులకు చేరవేయడంలో, రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు అందించడంలో, వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేయడంలో విశేష సేవలు అందిస్తున్నారు. వారి సేవలకు గుర్తింపుగా జిల్లా స్థాయిలో ప్రశంసలు లభించడం పట్ల రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకే మండలానికి చెందిన ఇద్దరు అధికారులు, ఒకే శాఖలో ఒకేసారి జిల్లా స్థాయిలో ప్రశంసలు అందుకోవడం కేసముద్రం మండలానికే కాకుండా ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాలోని వ్యవసాయ శాఖకు గర్వకారణంగా నిలిచింది.






