జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి,(విజయక్రాంతి): వనపర్తి జిల్లా నాగవరం శివారులోని తెలంగాణ గురుకుల బాలికల సంక్షేమ పాఠశాల (TGSWRS)(పెద్దమందడి)లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం (National Deworming Day) కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులకు స్వయంగా ఆల్బెండాజోల్ మాత్రలను పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులందరికీ నేడు ఆల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఈ మాత్రను నమిలి నీటితో మింగాలని సూచించారు. పిల్లలు చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ఆహారం తీసుకోవడం వల్ల నులిపురుగులు కడుపులోకి చేరి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని, ఆల్బెండాజోల్ మాత్ర తీసుకోవడం ద్వారా అవి నశిస్తాయని చెప్పారు.
ముఖ్యంగా యుక్తవయస్సులో ఉన్న బాలికలకు రక్తహీనత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని, అందువల్ల ఈ మాత్రను తప్పనిసరిగా తీసుకోవడంతో పాటు ఆకుకూరలు, ప్రోటీన్లు అధికంగా ఉండే పోషకాహారం తీసుకోవాలని సూచించారు. ఏ విద్యార్థి కూడా ఆల్బెండాజోల్ మాత్ర తీసుకోవడం మిస్ కాకూడదని, పాఠశాల ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థికి మాత్ర అందేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. నేడు హాజరు కాని విద్యార్థులకు ఈ నెల 20న నిర్వహించే మాప్-అప్ డేలో ఆల్బెండాజోల్ మాత్రలు అందజేయనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి సంక్షేమ విద్యాసంస్థల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని, విద్యార్థులు కష్టపడి చదివి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. త్వరలో ప్రభుత్వ పాఠశాలల్లో కృత్రిమ మేధస్సు తరగతులను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. సాయినాథ్ రెడ్డి, ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. పరిమళ, పాఠశాల ప్రిన్సిపాల్, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






