మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన
ఖమ్మం,(విజయక్రాంతి): మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి – ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించుకోండి అని ఇన్స్పెక్టర్ భానుప్రకాష్ విద్యార్థులకు సూచించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్యంపై పడే తీవ్ర ప్రభావాలు, భవిష్యత్ జీవితంపై కలిగే దుష్పరిణామాలపై పలు పాఠశాలల విద్యార్థులకు,సిబ్బందికి అవగాహన కల్పించే ఉద్దేశంతో పాండురంగపురం, బల్లెపాలి గ్రామంలోని పలు పాఠశాలలో ఖానాపురం హవెలి పోలీసుల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ..విద్యార్థులకు సురక్షితమైన, మాదక ద్రవ్యాల రహిత వాతావరణాన్ని కల్పించడంతో పాటు, మాదక ద్రవ్యాలపై స్థానిక సమాజంలో అప్రమత్తతను పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు.విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్‌కు అలవాటు పడటం వల్ల ఎదురయ్యే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక సమస్యలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని అన్నారు.
కార్యక్రమంలో భాగంగా శిక్షణ పొందిన నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ తో పాఠశాల పరిసర ప్రాంతాలలో, ప్రాంగణానికి సమీపంలోని దుకాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాల ఆనవాళ్లను గుర్తించేలా తనిఖీలు చేపట్టారు.






