శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
రావిచేడ్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ సమావేశానికి హాజరు
ఆమనగల్లు, అగస్టు29(విజయక్రాంతి): కల్వకుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి శనివారం పలు అభివృద్ధి, స్థానిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇందులో భాగంగా మక్తమాదారం గ్రామ పంచాయతీలోని వేణుగోపాలస్వామి ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం, రావిచేడ్ గ్రామ పంచాయతీలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
గ్రామంలో ఎస్‌ఐఆర్ నమోదు ఏ విధంగా జరుగుతోంది, క్షేత్రస్థాయి పరిశీలన ఎంతవరకు వచ్చిందనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ... ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. గ్రామస్తులందరికీ అవసరమైన పూర్తి సమాచారాన్ని అందిస్తూ, సందేహాలను నివృత్తి చేయాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నిర్ణీత గడువు తేదీలోపే ఈ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు లేకుండా విజయవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






