నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పాలకులు చర్యలు చేపట్టాలి
కొత్తగూడెం టౌన్, (విజయక్రాంతి): నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు నమగ్ర చర్యలు చేపట్టి యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్కే ఫహీమ్ దాదా అన్నారు. శనివారం సిపిఐ కార్యాలయం శేషగిరి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు అనుముల సాయితో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ శాఖల్లో వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, దీంతో సకాలంలో ప్రజాసేవలు ముందుకు సాగడం లేదన్నారు. వెంటనే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని కోరారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలుపుకోడం లేదని, ఏటా 2 లక్షల ఉద్యోగాల భర్తీ, నెలకు రూ.4వేల నిరుద్యోగ బృతి కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రంగ సంస్థలను ప్రైవేటు వరం చేస్తూ నిరుద్యోగ వ్యవస్థను పెంచిపోషిస్తున్నారని, ఆ విధానాలు మానుకోవాలన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, జిల్లాలో ఉన్న పరిశ్రమల్లో స్థానిక యువత నిరుద్యోగ సమస్యను రూపు మాపాలాన్నారు.
పేద నిరుద్యోగుల కోసం ప్రభుత్వం ఉచిత కోచింగ్ సెంటర్లు, స్టడీ హాల్స్, లైబ్రరీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మత్తు పదార్థాలు, గంజాయి వంటి వాటితో పాటు ఆన్లైన్ బెట్టింగులకు యువత బానిసలువుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, దీనిపై సంబంధిత శాఖలు కఠినంగా వ్యవహరించాలని, మహిళలకు భద్రత కల్పించాలని కోరారు. నిరుద్యోగం విద్య ఉపాధి సమస్యలపై నిరంతర పోటాలు సాగిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో సాధనపల్లి సతీష్ ,ఎన్కే ఖయ్యూమ్ భూపేష్, ఎండి నాదీమ్ ,రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.






