ప్రభుత్వ బడుల్లో వంద శాతం హాజరే లక్ష్యం
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు వంద శాతానికి చేరేలా ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కే. హరిత సూచించారు. శనివారం దహెగాం మండలం చిన్న రాష్పల్లి గ్రామంలోని ఎం.పి.పి.ఎస్ పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి, పాఠశాల పరిసరాలను పరిశీలించారు.
విద్యార్థుల దినసరి హాజరు రిజిస్టర్లను తనిఖీ చేసి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు ప్రతిరోజూ క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. నాణ్యమైన విద్య అందిస్తున్న ప్రభుత్వ బడుల్లోనే పిల్లలను చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఆంగ్ల మాధ్యమ విద్య అందుబాటులో ఉందనే విషయాన్ని గ్రామీణ ప్రజలకు వివరించాలని అన్నారు.






