నాగన్న సంతాప సభను జయప్రదం చేయండి
- సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ
గుండాల,(విజయక్రాంతి): అరుణోదయ నాగన్నకు మరణం లేదని, ఆయన ప్రజల హృదయాలలో ఎప్పుడూ పాట రూపంలో ఉంటాడని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి కోరం సీతారాములు, ఏఐకేఎంఎస్ మండల అధ్యక్షులు గడ్డం లాలయ్యలు అన్నారు. గుండాల ప్రధాన కూడలిలో సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ మండల నాయకులు యాసారపు వెంకన్న అధ్యక్షతన జరిగిన సంతాప సభలో వారు మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా రాజారం గ్రామంలో జన్మించిన పరకాల నాగన్న అరుణోదయ నాగన్నగా గోదావరి లోయ పరివాహక ప్రాంతమంతా విస్తరించి పేరుగాంచాడని అన్నారు.
పేద కుటుంబంలో పుట్టి పాలేరు జీవితం నుండి కానూరీ పాటలతో ముగ్ధుడైన నాగన్న పార్టీ పూర్తి కాలం కార్యకర్తగా ఎదిగి బడుగు బలహీన వర్గాల కోసం భూస్వాముల వ్యతిరేకంగా పోరాటం చేస్తూ, అమరవీరుల పాటలని పాడుతూ ప్రజా సమస్యలపై నాటికలు వేస్తూ, జానపద గేయాలు ఆలపిస్తూ ఒక ఉన్నత శిఖరానికి ఎదిగాడని కొనియాడారు. నాగన్న కి చదువు రాకపోయినా, వేరొకరు పాటలు పాడి వినిపించాక గుర్తు పెట్టుకొని చూడకుండా పాడేవాడని, సొంతంగా కూడా కొన్ని పాటలు రాశాడని, అందుకే ఆయన ఏకసంతాగ్రహి అని గుర్తు చేసుకున్నారు.
ఎన్ని అవకాశాలు వచ్చినా, ఎన్ని ప్రలోబాలకు గురిచేసినా పార్టీకి ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడుతూ నిరాడంబర జీవితాన్ని గడిపిన వ్యక్తిగా ఆయన జీవితం గడిచిందని, ఎందరికో ఆదర్శంగా నిలిచాడని వారు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అరుణోదయ నాగన్న అంటే తెలవని వారు లేరని, ఎంతోమంది అమరవీరుల పాటలను ఆలపించి, వారి రూపాన్ని పాట రూపంలో కళ్ళ ముందు నిలబెట్టిన చరిత్ర నాగన్నది అని కొనియాడారు. రేపు జూన్ 11 న ఇల్లందులో జరిగే నాగన్న సంతాప సభను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.






