24 July, 2026 | 5:20 PM

రెండు గంటల్లోనే మిస్సింగ్ బాలుడిని ట్రేస్ చేసిన నాచారం పోలీసులు

24-07-2026 04:37 PM

ఉప్పల్,(విజయక్రాంతి): ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ బాలుడిని నాచారం పోలీసులు కేవలం రెండు గంటల్లోనే మొబైల్ ఫోన్ ట్రాకింగ్ ద్వారా గుర్తించి, సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. సబ్ ఇన్స్పెక్టర్ మైబలి తెల్పిన వివరాల ప్రకారం... మల్లాపూర్‌లోని వెంకటరమణ కాలనీకి చెందిన కందకంచి భార్గవ్ రాజు (17), విశ్వ చైతన్య కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 23వ తేదీ రాత్రి సుమారు 10 గంటల సమయంలో తన తండ్రి మల్లేశం వద్ద బైక్ కావాలని కోరగా, ఇవ్వకపోవడంతో ఇంటి నుంచి మొబైల్ ఫోన్ తీసుకుని వెళ్లిపోయాడు.

కొంతసేపటి తర్వాత బాలుడి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న నాచారం పోలీసులు వెంటనే స్పందించి బాలుడి మొబైల్ ఫోన్ చివరి లొకేషన్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. హెడ్ కానిస్టేబుల్ మట్టయ్య ఆధ్వర్యంలో హోమ్ గార్డ్ గాంధీ, పోలీస్ కానిస్టేబుల్ సతీష్ ప్రత్యేక బృందంగా ఏర్పడి దర్యాప్తు నిర్వహించారు.

మొబైల్ ఫోన్ లాస్ట్ లొకేషన్ ఆధారంగా చర్లపల్లి ప్రాంతంలో గాలింపు చేపట్టి అదే రోజు అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో బాలుడిని గుర్తించి సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాలుడిని అతని తల్లిదండ్రులకు అప్పగించారు. తమ కుమారుడిని క్షేమంగా గుర్తించి అప్పగించినందుకు కుటుంబ సభ్యులు నాచారం పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. పిల్లలు, యువత ఇంటి నుంచి వెళ్లిపోయిన సందర్భాల్లో తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వేగంగా స్పందించేందుకు పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని అధికారులు తెలిపారు.