24 July, 2026 | 5:18 PM

విద్యార్థుల డిమాండ్లను నెరవేర్చాలి

24-07-2026 05:01 PM

ముకరంపుర,(విజయక్రాంతి): నీట్ పేపర్ లీకేజీపై ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా చేస్తున్న విద్యార్థుల ఆందోళనపై పాలక ప్రతిపక్షాలు రాజకీయాలు మానుకోవాలని, విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటమాడవద్దని ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు అన్నారు. ఎన్నో ఏళ్లుగా కష్టపడి చదివిన విద్యార్థుల ఆశలు, వారి తల్లిదండ్రుల కలలు ప్రశ్నాపత్రాల లీకేజీలతో ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కరీంనగర్ లో విద్యార్థుల దేశవ్యాప్త నిరసనకు సంఘీభావంగా నిర్వహించిన విద్యార్థి, యువజన, ప్రజాసంఘాల సమావేశంలో పోలాడి రామారావు మాట్లాడారు. ఇది కేవలం ఒక పరీక్షలో జరిగిన తప్పిదం కాదని, దేశ విద్యా వ్యవస్థ విశ్వసనీయతపై పడిన మచ్చగా మిగిలిందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.