1 September, 2026 | 3:29 AM

సందీప్ వంగాపై నా ప్రేమ మాటల్లో చెప్పలేనిది

01-09-2026 12:00 AM

 స్టార్ హీరో విజయ్ దేవరకొండ

బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా ‘రోమాంచకం’. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రణయ్‌రెడ్డి వంగా నిర్మాత. నూతన దర్శకుడు వేణుగోపాల్‌రెడ్డి రూపొందిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 3న థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఏషియన్ సినిమాస్ ద్వారా ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించగా, స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “సందీప్‌పై నాకున్న ప్రేమను మాటల్లో చెప్పలేను. 

అది ఒక దర్శకుడు, హీరో మధ్య ఉన్న బంధం కాదు, ఒక బ్రదర్స్ మధ్య ఉన్న బంధం కాదు, స్నేహితుల మధ్య బాండింగ్ కాదు. మా బంధం అంతకుమించింది. ‘అర్జున్‌రెడ్డి’ టైమ్‌లో మేమిద్దరం ఒక యుద్ధం లాంటి ప్రయత్నం చేశాం. ఆ సినిమా వర్కవుట్ కాకుంటే ఏమయ్యేదో ఊహించలేకపోయాం. మాకు అప్పుడు డబ్బు లేదు, పేరు లేదు, ఇన్‌ఫ్లూయెన్స్ లేదు. ‘పెళ్లిచూపులు’ కూడా రిలీజ్ కాలేదు కాబట్టి అభిమానులు కూడా మా వెనక లేరు. జస్ట్ మేము ధైర్యంగా అడుగేశాం. అర్జున్ రెడ్డి సినిమా లేకుంటే ఆ సక్సెస్ మాత్రమే కాదు సందీప్‌తో షేర్ చేసుకున్న ఎన్నో ఎక్స్‌పీరియన్స్‌లు, మూవ్‌మెంట్స్ మిస్ అయ్యేవాడిని. జీవితం గురించి మాట్లాడుకున్న ఎన్నో సందర్భాలు మిస్ అయ్యేవాడిని.

డబ్బు లేనప్పుడు సందీప్ వాళ్ల బ్రదర్ ప్రణయ్, ఫాదర్‌తో పొలం అమ్మించి నాతో నా మీద నమ్మకంతో అర్జున్‌రెడ్డి సినిమా చేశాడు. వాళ్ల ఫ్యామిలీ సంపాదన మొత్తం ఒక సినిమా మీద ఇన్వెస్ట్ చేశాడు. సందీప్ కోసం నేను ఎక్కడిదాకా అయినా వెళ్తా, నాకోసం సందీప్ ఎక్కడిదాకా అయినా వస్తాడు. ఆయన పిలిచాక నేను ఈ ఫంక్షన్‌కు రాకుంటే నేను బతికి ఎందుకు. సుమంత్‌ను చూసినప్పుడు ఆయన కళ్లలో సినిమా పట్ల ఒక డ్రీమ్ కనిపించింది. అప్పుడే అనుకున్న సుమంత్ ప్రభాస్ ఏదో ఒక రోజు యాక్టర్ లేదా డైరెక్టర్ అవుతాడు. అప్పుడు మనం చేయగలిగినంత ఇతనికి చేయాలని. ‘మేమ్ ఫేమస్’ సినిమాకు నా వంతు ప్రమోషన్ చేశా. భద్రకాళీ లోగో పడుతుంటే అర్జున్‌రెడ్డి సౌండ్ వినిపిస్తుంటుంది.

సందీప్, ప్రణయ్ ఒక సినిమా చేస్తున్నారంటే అది తప్పకుండా విజయం సాధిస్తుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా. సెప్టెంబర్ 2న ప్రీమియర్స్‌తోనే ఈ సినిమా ఘన విజయం సాధించాలి. సినిమాకు వర్క్ చేస్తున్నప్పుడు మనం ఎంత ఎంజాయ్ చేశాం అనేది ముఖ్యం. సక్సెస్ ఇవాళ కాకుంటే రేపైనా వస్తుంది. మనపై మనకు నమ్మకం ఉండి, మనలో విజయం సాధించాలనే తపన ఉంటే తప్పకుండా విజయం దక్కుతుంది” అన్నారు. 

నిర్మాత సందీప్‌రెడ్డి వంగా మాట్లాడుతూ.. “డైరెక్టర్ వేణుగోపాల్ ఈ కథ చెప్పినప్పుడు బాగా నవ్వుకున్నా. అయితే కథ చెప్పినంత బాగా సినిమా తీస్తావా అని అడిగాను. ఆయన ఒక 6 నిమిషాల నిడివి గల సీన్ తీసుకొని వచ్చి చూపించాడు. స్క్రిప్ట్‌లో ఉన్న దానికంటే ఇంకా బాగా సీన్ తెరకెక్కించాడు అనిపించింది. అప్పటి నుంచి వేణుకే ఈ సినిమా బాధ్యత మొత్తం అప్పగించాను. నేను ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదు. మెయిన్ లీడ్ కాబట్టి హీరో అనే ఫీల్ సహజంగానే ఉంటుంది. కానీ సుమంత్ ప్రభాస్ అలాంటిదేం కనిపించకుండా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అందరితో కలిసిపోయి బాగా నటించాడు.

అతనిది అమాయకమైన క్యారెక్టర్. ఆ పాత్రలో బాగా నటించాడు అనిపించింది. అనంతిక పర్‌ఫార్మెన్స్ రియల్లీ గుడ్. డైరెక్టర్ వేణుగోపాల్ కల నిజమయ్యే రోజు సెప్టెంబర్ 3. ఆ తర్వాత నువ్వు ఎన్ని సినిమాలు చేసినా ఆ రోజు నీ జీవితంలో మర్చిపోలేనిదిగా ఉంటుంది. నాకు, విజయ్‌కు అర్జున్‌రెడ్డి రిలీజైన ఆగస్టు  24 ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాంటి రోజు నీకూ రావాలని కోరుకుంటున్నా. సినిమా అంతా గట్టిగా నవ్వుకుంటారు. ఈ సినిమా కోసం మీరు వెచ్చించే డబ్బు, సమయం ఏమాత్రం వృథా కాదు. మళ్లీ సినిమా చూడాలని కూడా అనుకుంటారు” అని చెప్పారు. 

హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ.. “నేను మేమ్ ఫేమస్ సినిమా అప్పుడు విజయ్ అన్న ఇచ్చిన బూస్ట్ ఇంకా మాలో ఉత్సాహం నింపుతోంది. సందీప్ అన్న ఈ సినిమా కథ గురించి చెప్పి విను అన్నప్పటి నుంచి, భద్రకాళీ ఆఫీస్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి నాకు జీవితంలో రోజూ రోమాంచకమే. అర్జున్ రెడ్డి తర్వాత దేశమంతా మన వాళ్లైన సందీప్, విజయ్ అన్న గురించి మాట్లాడుకున్నారు. ఈ రోజు వాళ్ల బ్యానర్‌లో సినిమా చేస్తుంటే నాకూ పెద్ద హీరో కావాలనిపిస్తోంది. అందుకు ఈ సినిమానే మెట్టు కావాలి. ఈ సినిమా మిమ్మల్ని ఎంత ఎంటర్‌టైన్ చేస్తుందో, ఎంత నవ్విస్తుందో నేను ఊహించగలను. సెప్టెంబర్ 3న ఈ క్యూట్ ఫీల్ మీకు రెండున్నర గంటలు నాన్‌స్టాప్‌గా ఉంటుంది” అన్నారు. 

హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్ మాట్లాడుతూ.. “ఈ టీమ్ అందరితో ఎంతో సరదాగా, సంతోషంగా వర్క్ చేశాను. ప్రతిరోజూ రోమాంచకం ఫీల్ మా అందరిలో ఉండేది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరితో చూసి ఎంజాయ్ చేసే ఎంటర్‌టైనర్ ఇది” అని తెలిపింది. 

డైరెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. “కాలేజ్‌లో ఉన్నప్పుడు మనం ఏదైనా చేస్తామనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ కాలేజ్ నుంచి బయటకు వచ్చాక రియాల్టీ తెలుస్తుంది. ఆ సందర్భాన్ని నా కథలో చెప్పాను. ఆ సందిగ్ధ పరిస్థితిని సహజంగా, అందంగా నా తరహాలో సినిమాగా తెరకెక్కించాను. నా విజన్‌ను నమ్మాను. ఈ సినిమా కొత్తగా ఉంటుంది. రోమాంచకం ఫ్రెష్ ఫీల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది” అని తెలిపారు. 

ప్రొడ్యూసర్ ప్రణయ్‌రెడ్డి వంగా మాట్లాడుతూ.. “రోమాంచకం’ సినిమా బాగా వచ్చింది. కుటుంబ సభ్యులతో హ్యాపీగా చూసే క్లీన్ మూవీ ఇది” అని చెప్పారు. టాలీవుడ్ డైరెక్టర్లు మెహర్ రమేశ్, డైరెక్టర్ శౌర్యువ్, చిత్ర నటీనటులు మానస, సోహాన్, మణి, నరేంద్ర, కమల్, సతీశ్, డీవోపీ పవన్ పప్పుల, మ్యూజిక్ డైరెక్టర్ వాసుకి వైభవ్, లిరిక్ రైటర్ చంద్రబోస్, కొరియోగ్రాఫర్ గోవింద్ మాస్టర్, కాస్ట్యూమ్ డిజైనర్ కీర్తన కూడా ఈ వేడుకలో మాట్లాడారు.