పెట్రోల్ కొరత.. బంకుల వద్ద వాహనదారుల క్యూ!
షాద్ నగర్ లో పెట్రోలు డీజిల్ దొరక్క అగచాట్లు
కొన్ని చోట్లలో పోలీస్ పహారాలో పెట్రోల్ డీజిల్ సరఫరా
షాద్‌నగర్,(విజయక్రాంతి): పెట్రోల్, డీజిల్ కోరత కొరత.. ఓ వైపు ప్రభుత్వ అధికారులు, మరోవైపు ప్రజా ప్రతినిధులు పెట్రోల్ డీజిల్ కొరతలేదని చెబుతూ కాలక్షేపం చేస్తుంటే సామాన్యుడు నడిబజారులో వాహనం చేత పట్టుకుని నెట్టుకుంటూ తోసుకెళ్తున్నాడు. మరోవైపు చేతిలో క్యాన్ డబ్బాలు పట్టుకొని పరిగెత్తుతున్నాడు. ఇవన్నీ కనిపిస్తున్న అధికారులు పెట్రోల్ డీజిల్ కొరతలేదని బుకాయిస్తున్నారు. గత రెండు రోజులుగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో తీవ్రమైన పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది. ప్రజలు తమ పనులు చేసుకోలేక రాకపోకలు కొనసాగించలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్ని వాహనాలు తమ ఇండ్లకే పరిమితమయ్యాయి.
అంతేకాదు తెలంగాణలో పలు చోట్ల పెట్రోల్, డీజిల్ కొరత సమస్య వెంటాడుతోందనీ ప్రజలు చెబుతున్నారు. చాలా ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయనీ పెట్రోల్ దొరుకదన్న భయంతో వాహనదారులు బంకుల దగ్గర క్యూ కడుతున్నారు. పెట్రోల్, డీజిల్ లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాలలో బంకు యజమానులే కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్‌లో విక్రయిస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.
మరోవైపు పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రజల్లో అయోమయం నెలకొంది. అసలే వివాహాల సీజన్ పెట్రోల్ డీజిల్ లభించక కార్యాలన్నీ అనేక కారణాల చేత చెడిపోతున్నాయి. ముఖ్యంగా ఇతర వ్యాపార లావాదేవీలు కూడా ఆగిపోయాయి. ప్రజలు ఇంట్లో నుండి బయటికి కాలు పెట్టలేని పరిస్థితి. పోవైపు మాడుతున్న ఎండలు మరోవైపు పెట్రోల్ డీజిల్ కొరతతో పూర్తిగా సతమతం అవుతున్నారు. షాద్ నగర్లో పెట్రోల్ బంక్ లు మూత, అన్నారం బైపాస్ లో ఒక బంక్ లో బారులు తీరిన వాహనాలు పోలీస్ పహారాలో పెట్రోల్ డీజిల్ సరఫరా.. జరుగుతున్న తీరు చూస్తే పరిస్థితి అర్థమవుతుంది.






