11 May, 2026 | 3:14 AM

అమ్మ ఒడి ‘పల్లె బడి’

11-05-2026 12:15 AM

‘మెరుపు మెరిస్తే వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే, అవి మీకే అని ఆనందించే కూనల్లారా’ అంటూ మహాకవి శ్రీశ్రీ తన ‘మహాప్రస్థానం’లో తానొక పిల్లాడన్నట్లు రాశారు. వానలు కురిసినా, వాగులు పొంగినా, ఇంద్రధనుస్సు కనబడినా తమకోసమేనని కేరింతలు కొడుతారు పిల్లలు. తరచి చూస్తే అనంతమైన విశ్వం, ఈ ప్రకృతి అన్నీ పిల్లలవే. రేపటి ప్రపంచానికి వారసులు వారే. భవిష్యత్తును నిర్ణయించేది, ఈ ప్రపంచ గమనాన్ని మార్చగలిగే శక్తిమంతులు వాళ్లే. ఇలాంటి శాస్త్రీయమైన భావనతో సమ్మెట ఉమాదేవి వెలువరించిన నవల ‘పల్లె బడి’. నవల అనగానే ఎవరైనా ఎన్నెన్నో పాత్రలు, ఎన్నె న్నో విశేషణాలు, ఎన్నెన్నో భావోద్వేగాలతో కూడి ఉన్నవని అనుకుంటాం. కానీ, ఉమాదేవి అంత సంక్లిష్టమైన రచన చేయలేదు.

పిల్లలకు అర్థమయ్యే రీతిలో చక్కటి భాషలో నవలను తీర్చిదిద్దారు. గిరిజన జీవితాలు ‘పల్లె బడి’ నవలలో ఇతివృత్తంగా ఉంటాయి. గ్రామంలోని ప్రాథమి కోన్నత పాఠశాలలో ఏడో తరగతి వరకు అవకాశం ఉంది. ఆ బడిలో ఫిరోజ్ సార్, మహిత మేడం, శైలజ మేడం పిల్లలకు పాఠాలు బోధిస్తుంటారు. ఏ డు తరగతులకు ముగ్గురే టీచ ర్లు. అక్కడి పిల్లలు ఒక వారం పాఠశాలకు హాజరైతే మరో వారం హాజరుకారు. ఈ వా రం నేర్చుకున్నవి మరో వారం వచ్చేసరికి మరచిపోతారు.

త ర్వాత వారం వచ్చినప్పుడు, వారికి మళ్లీ మొదటి నుంచి పాఠాలు చెప్పాల్సి ఉంటుంది. ఆ పిల్లలందరూ మట్టిలో మాణిక్యాలే. కేవలం వాళ్లే కాదు, ఇప్పుడు ప్రపంచ స్థాయిలో పేరుప్రఖ్యాతలు పొందిన వారందరూ ఒకప్పుడు మారుమూల పల్లెల నుంచి వచ్చిన వారే. అబ్దుల్ కలాం, మహేంద్ర సింగ్ ధోని, శ్రీధర్ వెంబు, చింతకింద మల్లేశం, కల్పనా సరోజ్.. వీరందరూ తమ గురువులు చెక్కిన శిల్పాలే. సరిగ్గా అలాంటి తరహా బాధ్యతలు తీసుకునేందుకు ఫిరోజ్ సార్, మహిత మేడం, శైలజ మేడం ముందుకొచ్చారు.

పల్లెలకు చెందిన చిన్నారులు స్వతహాగా ధైర్యవంతులు. పట్టుదల కలిగిన వారు. మొండివారు. ఈ నవలలో శంకర్ ఏటిలో ఎదురీదగలడు. సోనీ గురి చూసి కొట్టగలడు. నర్సింగ్, నారాయణ వాగులోకి వచ్చిన దుంగలను ఒడిసి పట్టుకోగలరు. రాహుల్, స్వాతి, ఆశ, పవన్ చక్కగా పాటలు పాడగలరు. లక్ష్మణ్ అద్భుతంగా బొమ్మలు గీయగలడు. గుర్తించాలే గానీ, ఎవరికి వారు ఏదో ఒక విద్యలో నైపుణ్యం కలిగినవారే. ఆ పిల్లలకు నైపుణ్యాలే కాదు.. పరిధులు కూడా ఉన్నాయి.

పదహారేళ్లు కూడా నిండని స్వాతికి పెళ్లి చేయాలనుకుంటుంది వాళ్లమ్మ నర్సమ్మ. దుర్గ తన చెల్లెలి బాధ్యతను తీసుకుంటేనే వాళ్లమ్మ పనికి వెళ్లగలదు. శంకర్‌కు స్కూలన్నా, చదువన్నా నచ్చదు. ఇలా చెప్పుకొంటూ పోతే, ఎవరి సమస్యలు వారివి. టీచర్లకు ఆ పిల్లల ప్రతిభతోపాటు, వారి పరిధులు, ప్రతిబంధకాలు కూడా తెలుసు. రచయిత్రి స్కూలులో ఒక సంవత్సరం పాటు జరిగిన అనేక ఘటనలను గుదిగుచ్చి నవలలో కూర్చారు.

సోనీ విలువిద్యలో నైపుణ్యం పొందగలగడం, పాఠశాల పిల్లలు ఆడుకునే మైదానంలో, గ్రామ పెత్తందార్లు మొక్కలు నాటడం, ట్రైనీ కలెక్టర్ పాఠశాలను సందర్శించడం, బాలోత్సవ్ లో పాల్గొన్న పిల్లలు తమ ప్రతిభను చాటడం, రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీలకు ఆ పాఠశాల పిల్లలు ఎంపిక కావడం, శంకర్ వాగులో కొట్టుకుపోవడం, మొదలైన ఘటనలన్నీ పుస్తకం పట్టుకున్న పాఠకుడిని కట్టిపడేస్తాయి. ఆద్యంతం చదివిస్తాయి. నవల కేవలం పిల్లలు మాత్రమే చదవాల్సిన నవల కాదు. తల్లిదండ్రులు కూడా చదవాల్సిన నవల. మరీ ముఖ్యంగా ఉపాధ్యాయులు తప్పక చదవాల్సిన నవల. ఇంత మంచి నవలను ప్రచురించిన ‘బాల బుక్స్’ వారికి ధన్యవాదాలు. రచయిత్రికి ఉమాదేవి శుభాకాంక్షలు. రచయిత్రి నుంచి మరింత బాల సాహిత్యం రావాలని ఆకాంక్షిస్తున్నాను.

ప్రతులకు: బాల బుక్స్ పబ్లికేషన్స్

సెల్: 99080 91509  www.balabookscorner.com