11 May, 2026 | 2:09 AM

చెమట చుక్కల చెలిమి

11-05-2026 12:13 AM

సూరీడు పొడవక ముందే

సద్ది కట్టుకొని

అడ్డా మీద నిలబడ్డాడు అతడు

ఇంట్లో బంధాల్ని

ఇంట్లోనే వదిలేసి

రెక్కల్ని ముక్కలు చేసుకునైనా..

వారి ఆకలి తీర్చాలని ఓ తపన

ఎక్కడి నుంచి ఎక్కడికో..

రికామ్ లేని బ్రతుకు ప్రయాణం...

సేద తీరటానికి

ఒక్కటంటే ఒక్క మజిలీ...

అతన్ని ఎప్పుడూ... హత్తుకోలేదు


ఐనా...

ఆయన సృ్మతి పథంలో

వేల వేల చల్లని తుంపర్ల ఏకాదాటి

పూల వాన

ఆమె గురించి నేనేమీ చెప్పను

అతనికి ఆమె ఓ ఓదార్పుల స్నేహిత

మనసు విచిత్ర సోపానాల 

సమాహారం కదా!

స్వేదంతో తడ్వాడీ.. తడ్వాడీ

పులిసిన దేహం

ఇల్లు వాసనతో పులకరిస్తుంది

ఇల్లాలి కొంగును

నుదుటి చెమట సుతారంగా 

ముద్దాడటం

హృదయం పురివిప్పి

నాట్యం చేసి 

రసరమ్య దృశ్యం.. అది

శ్రమ జీవన పోరాటంలో 

అల్లుకుపోయే కావ్యం

మారే రుతువులు.. రుతున్న కాలం

ఈ రోజే కాదు.. రేపు కూడా

ఈ చెమట చుక్కల చెలిమిలో

ఎన్ని ఇంద్రధనుస్సులు పొడుస్తాయో?