11 May, 2026 | 4:32 AM

భావోద్వేగాలదే పైచేయి

11-05-2026 12:17 AM

అంతర్జాతీయ సాహిత్య రంగంలో ఇప్పుడొక వింత పరిస్థితి నెలకొంది. ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో రచయితలు, కథకులు తమ రచనలను తామే రాశామని నిరూపించుకో వడానికి నానా తంటాలు పడుతున్నారు. ప్రచురణ కర్తలు ఎక్కడ తమవి ఏఐ రాతలని పక్కన పడేస్తారోనని ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితికి కారణం.. గతంలో కంటే ఇప్పుడు ఆన్‌లైన్ కంటెంట్‌లో ఎక్కువగా ఏఐ సృష్టించిన సాహిత్యమూ ట్రెండింగ్‌లో ఉడంటం.

దీంతో ఏది మనిషి రాశారో, ఏది యంత్రం రాసిందో కనిపెట్టడం కష్టంగా మారింది. ఈ క్రమంలో రచయితలు తమ రాతల్లో కావాలనే కొన్ని మార్పులు చేస్తున్నారు. తాము రాసిన వ్యాసాలు ఏఐ రాసినవి కావని చెప్పేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. కొం దరు రచయితలైతే కొంచెం వింతగా కూడా వ్యవహరిస్తున్నారు. తమ రచనల్లో ఉద్దేశపూర్వకంగా కొన్ని తప్పు లు వదిలేస్తున్నారు. కొందరు తమ రాతల్లో కావాలనే చిన్న చిన్న టైపింగ్ తప్పు లను ఉంచుతున్నారు.

మరికొందరు వ్యాకరణ దోషాలు రాస్తున్నారు. అవన్నీ ఉంటేనే ఆ రచన మనిషి రాసినట్లు కనిపిస్తుందని వారు విశ్వసించడమే కారణం.  ఇది ఎంత దూరం వెళ్లిందంటే అమెరికాకు చెందిన ఇవాన్ జాక్సన్ అనే వ్యక్తి ఏఐ రాతలను మనిషి రాతల్లా మార్చే ఒక సాఫ్ట్‌వేర్‌నే రూపొందించాడు. ఈ సాఫ్ట్‌వేర్ ఏఐ వాడే కొన్ని పదబంధాలను గుర్తించి, వాటిని టెక్ట్స్ నుంచి తొలగిస్తుది. అంతేకాదు.. సహజమైన పదాలనూ చేరుస్తుంది.  చిత్రం ఏమిటంటే.. మనుషులు రాసిన రాతలను కూడా కొందరు రూపొందించిన సాఫ్ట్‌వేర్లు ఏఐ రాసినవిగా చూపిస్తున్నాయి. దీనికి కారణం మనుషులు కూడా తెలియకుండానే ఏఐ శైలిని అలవాటు చేసుకోవడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రఖ్యాత రచయితల అభిప్రాయాలు

బుకర్ ప్రైజ్ గ్రహీత సల్మాన్ రష్దీ సాహిత్య రంగం లో ఏఐ ప్రభావంపై ఇటీవల స్పందిస్తూ.. ‘నా శైలిలో ఏఐ రాసిన కొన్ని వాక్యాలను, పేరాలను నేను చూ శాను. అవి చూశాక నాకు నవ్వొచ్చింది. నా శైలిలో ౧౦శాతమైనా ఏఐ పట్టుకోలేకపోయింది. ఒక రచయితలో సహజసిద్ధంగా ఉండే వైవిధ్యం, ప్రత్యేకమైన శైలి ఎప్పటికీ ఏఈ ఒడిసిపట్టలేదు. సాహిత్యమనేది హృదయం నుంచి రావాలే తప్ప, హార్డ్ డిస్క్ నుంచి కాదు’ అని ఖరాఖండీగా చెప్పారు. ప్రఖ్యాత జపనీస్ రచయిత హరుకి మురకామి స్పందిస్తూ.. ‘నేనెప్పుడూ నా అంతరాత్మ చెప్తున్న భావాలనే మాటలుగా పేరుస్తాను. అలా కొన్ని మాటలతో వాక్యాలు అల్లుతాను. వాక్యాలతో కథ అనే పందిరి తీర్చిదిద్దుతాను.

ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే? అలాంటి శక్తి ఏఐకి ఉంటుందా? ఏఐ కేవలం కోట్లాది వాక్యాలను గుదిగుచ్చగలదు. నువ్వు అడిగిన ప్రశ్నకు యాంత్రికమైన సమాధానం ఇవ్వగల దు. దానికి కాఫీ పరిమళాలు తెలియవు. తొలకరి జల్లు ల్లో ఏకాంతం తెలియదు. ఇవేమీ అనుభవంలోకి లేకుం డా ఒక రచన బయటకు వస్తుందంటే, అదెలా రచన అవుతుంది? అందుకే, ఏఐ ఎప్పటికీ సృజనాత్మకతకు ప్రత్యామ్నాయం కాదని నేను నమ్ముతాను’ అని కుండబద్దలు కొట్టారు.

అనుభవం నుంచి వచ్చిన రచనే గొప్ప 

ఏఐ ఎన్ని పదాలను పోగుచేసినా మనిషి హృదయంలోని లోతైన భావోద్వేగాలను ఒడిసిపట్టుకోలేదు. ఏఐ కేవలం ఒక మనిషి ఇచ్చే ఇన్‌పుట్ మేరకే పనిచేస్తుంది. వాటి ఆధారంగానే వాక్యాలను నిర్మిస్తుంది. కా నీ, ఒక రచయిత అలా కాదు కదా. రచయిత అనుభవించే వేదన, సంతోషం, ఆశ్చర్యం అన్నీ.. అతని రాతల్లో ప్రస్ఫుటమవుతాయి. ఒక్క మానవ వ్యక్తీకరణలోనే ఆ వైవిధ్యం కనిపిస్తుంది. అదే ఒక రచనకు అందాన్నిస్తుంది. ప్రాణం పోస్తుంది. ఒక అనుభవం నుంచి పుట్టిన కవిత లేదా కథ పాఠకుల్లో కలిగించే అనుభూతి, ఆలోచన ఏఐ కలిగించలేదు. మనిషి రచనల్లోని పదాల వెనుక ఒక సామాజిక నేపథ్యం ఉంటుంది.

అతని వ్యక్తి త్వం ఉంటుంది. యంత్రం వాక్యాలు కచ్చితంగా, వ్యాకరణ దోషాలు లేకుండా ఇస్తుందే గానీ, పాఠకుడి గుం డెను తాకలేదు. భావ వ్యక్తీకరణలో  సహజమైన భావోద్వేగాలు మనిషికి మాత్రమే సాధ్యం. ఏఐ లోతైన ఆవేదనను అనుభవించి రాయలేదు. అందుకే సాంకేతికత ఎంత పెరిగినా మనిషి మనసు నుంచి వచ్చే సృజనాత్మకత ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటుంది. సాహిత్యానికి ప్రాణం పోసేది సమాచారం కాదు.. రచయిత తన అనుభవాల నుంచి వచ్చే భావోద్వేగం.

సహజత్వాన్ని వీడొద్దు

సాహిత్య రంగంలో ఏఐ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో రచయితలు, కవులు కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. కేవలం యాంత్రికమైన సమాచారం కాకుండా వ్యక్తిగత అనుభవాలను రచనల్లో జోడించాలి. సమాచార సేకరణకు ఏఐని వాడుకున్నప్పటికీ, రచన మాత్రం వందశాతం మనదే అయి ఉండాలి. రచనల్లో ప్రాంతీయ మాండలికాలు, సామెతలు, జాతీయాలు, అరుదైన పద ప్రయోగాలు ఉట్టిపడాలి. అందుకే కథకులు, వ్యాసకర్తలు తమ ఆలోచనలకు పదునుపెట్టాలి. మూస ధోరణిలో కాకుండా కొత్త కోణంలో విశ్లేషించాలి. సాహిత్య పటిమను కాపాడుకునేందుకు నిరంతర అధ్యయనం చేయాలి. వాటిని తమ రచనల్లో ప్రతిఫలింపజేయాలి. ఆధునిక సాంకేతికతను ఎప్పటికీ ఒక పరికరంగానే చూడాలని గుర్తుంచుకోవాలి. 

                     లక్ష్మి