సమాజ సేవలో మరింత మంది భాగస్వాములు కావాలి
రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ నిర్వాహకుడు పెద్ది శంకర్
బంజారాహిల్స్,జూన్ 28 (విజయక్రాంతి): సమాజ సేవలో మరింత మంది భాగస్వాములు కావాలని రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ నిర్వాహకుడు పెద్ది శంకర్ పిలుపునిచ్చారు. తద్వారా మరింత మంది సహాయార్థులకు సహాయం చేసే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. బంజారాహిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.
పేద క్యాన్సర్ బాధితులు, వారి సహాయకులు, కుటుంబ సభ్యులు సుమారు 300ల మందికి ఉచితంగా ఆహారాన్ని పంపిణీ చేశారు. నటుడు విజయభాస్కర్, జబర్దస్త్ కళాకారుడు శాంతి కుమార్, గాయకుడు శ్రీకాంత్ రెడ్డి, నటుడు సీఎన్ రెడ్డి, జర్నలిస్టు స్వామి ముద్దం, మహేష్ చింతల వాలంటీర్లుగా పాల్గొని.. ఫౌండేషన్ సభ్యులు, వాలంటీర్లతో కలిసి వందలాది మందికి ఆహారం అందించారు.
ఈ సందర్భంగా పెద్ది శంకర్ మాట్లాడుతూ ఆకలితో ఉన్నవారికి ఆకలిని తీర్చాలనే మంచి ఆలోచనతో అన్నదానం నిర్వహించామన్నారు. అన్నార్తులకు తమ కార్యక్రమం ఉపయోగపడడం ఆనందంగా ఉందన్నారు. తమతోపాటు సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలనుకునే దాతలు, వాలంటీర్లకు ఫౌండేషన్ తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని తెలియజేశారు.






