30 May, 2026 | 2:10 AM

రుతుపవనాలు ఆలస్యం

30-05-2026 01:58 AM
  1. సాధారణం కంటే వర్షపాతం ౩౦% వరకు తగ్గే అవకాశం 
  2. పసిఫిక్ మహా సముద్రంలో ఎల్ నినో 
  3. వేడిగాలుల కారణంగా నైరుతి మందగమనం
  4. అనివార్యంగా.. ఆలస్యంగా సాగు పనులు 
  5. సెప్టెంబర్ నాటికి మరింత బలంగా ఎల్‌నినో 
  6. వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం

న్యూఢిల్లీ, మే ౨౯: దేశంలోకి ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక ఆలస్యంకానుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం ప్రకటించింది. అలాగే, గతేడాదితో పోలిస్తే ఈసారి తక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. గడిచిన మూడేళ్లలో ఇలాంటి పరిస్థితి రాలేదని, వర్షపాతం 3ం శాతం వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. సాధారణంగా జూన్ మొదటి వారంలో కేరళంను తాకాల్సిన రుతుపవనాలు ఈసారి కాస్త ఆలస్యంగా ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది.

పసిఫిక్ మహాసముద్రంలో ‘ఎల్ నినో’ ప్రభావం తో సంభవించిన వాతావరణ మార్పులే అందుకు ప్రధాన కారణమని స్పష్టం చేసింది. వాస్తవానికి మే 26వ తేదీనే నైరుతి రుతుపవనాలు కేరళంను తాకనున్నాయని ఐఎండీ గతంలో అంచనా వేసింది. కానీ, ఈ సారి ఎల్‌నినో ప్రభావంతో ఆ అంచనా లు తలకిందులయ్యాయి. ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి చేరుకోవడం, భూగర్భ జలాలు ఇంకిపోతున్న తరుణంలో ఈ ప్రకటన దేశ రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది.

ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలపై తీవ్రప్రభావం పడనుంది. అలాగే, దక్షిణాదిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకపైనా వానాకాలం పంట కాలం ఆలస్యంగా మొదలుకానున్నది. సాధారణంగా రైతులు జూన్ ఆరంభంలోనే వ్యవసాయ పనులు మొదలుపెడతారు. పత్తి, మక్కలు, సోయాబీన్, వేరుశనగ వంటి విత్తనాలు నాటుతారు. వరి నారుమళ్లు సిద్ధం చేస్తారు. కానీ, రుతుపవనాలు ఆలస్యం వస్తుండటంతో సాగు పనులూ ఆలస్యంగా మొదలవనున్నాయి.

సకాలంలో వర్షాలు పడకపోతే విత్తిన విత్తనాలు మొలకెత్తకుండా ఎండిపోయే ప్రమాదం ఉంది. అలా గే, వర్షాలు ఆలస్యం కావడం విద్యుత్ రంగానికి తీవ్ర సవాల్‌గా మారనుంది. ఎండల తీవ్రత పెరుగుతుండటంతో రోజువారీ గృహ, పారిశ్రామిక రంగాలకు విద్యుత్ డి మాండ్ పెరగుతుంది. దీంతో బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ప్లాంట్లపై ఒత్తిడి పెరు గుతుంది.

డిమాండ్‌కు సరిపడా విద్యుత్ ఉత్పత్తి లేకపోతే, అనివార్యంగా ప్రభుత్వాలు విద్యుత్ కోతలు విధించాల్సి ఉంటుంది. వ్యవసాయ దిగుబడులు తగ్గడం వల్ల మార్కెట్‌లో ఆహార ధాన్యాల సరఫరా తగ్గుతుంది. దీనివల్ల పప్పుధాన్యాలు, కూరగాయలు, వంట నూనెల ధరలు పెరుగుతాయి. దీంతో దేశంలో ద్రవ్యోల్బణ సమస్య తీవ్రమవుతుంది. సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవన వ్యయం పెరుగుతుంది.

ఎల్‌నినో ప్రభావం తీవ్రం

వేడి గాలుల కారణంగా పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో బలపడుతున్నదని, ఆ ప్రభావం భారత వర్షపాతంపై పడుతున్నదని ఐఎండీ తెలిపింది. ఎల్‌నినో కారణంగా రుతుపవనాల మందగమనం కొనసాగుతుందని, జూలై రెండో వారం నుంచి ఆగస్టు నాటికి ఎల్ నినో మధ్యస్థాయికి చేరుకుంటుందని, సెప్టెంబర్ వచ్చే సరికి పూర్తిగా బలం పుంజుకుంటుందని పేర్కొంది.

ఈ పరిణామంపై చైనా, ఆస్ట్రేలియా వంటి అంతర్జాతీయ వాతావరణ సంస్థలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ సేకరించిన శాటిలైట్ చిత్రాలు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.