30 May, 2026 | 3:10 AM

యూపీఎస్సీని చూసైనా నేర్చుకోండి

30-05-2026 01:54 AM

దశాబ్దాల నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నది..

ఏనాడూ ప్రశ్నాపత్రం లీకేజీ జరగలేదు.. 

గత వైఫల్యాల నుంచి ఎన్టీఏ గుణపాఠాలు నేర్వలేదు: సుప్రీం కోర్టు 

‘నీట్’ లీకేజీపై కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్‌పై విచారణ

న్యూఢిల్లీ, మే29: ‘యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) దశాబ్దాల నుంచి ప్రతిష్ఠాత్మక పరీక్షలు నిర్వహిస్తున్నది. అయినప్పటికీ ఎన్నడూ పేపర్ లీకేజీ సమస్య రాలేదు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) కనీసం యూపీఎస్సీని చూసైనా పరీక్షలు ఎలా నిర్వహించాలో నేర్చుకోండి. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడొద్దు’ అంటూ సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. నీటీ యూజీటీ లీకేజీపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఎన్టీఏ స్థానంలో పార్లమెంట్ ద్వారా కొత్త స్వతంత్ర సంస్థను ఏర్పాటుచేయాలని కోరుతూ దేశ్యాప్తంగా పలు వైద్య సంఘాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఈ అంశంపై శుక్రవారం కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ నిర్వహణకు తాము పక్కా ప్రణాళికలు రూపొందించామని, సుప్రీంకోర్టు సూచన మేరకు నియమించిన రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సుల్లో చాలావరకు అమలు చేశామని పేర్కొంది.

అఫిడవిట్‌పై సుప్రీం కోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. ఇలాంటి వివాదాల్లో నిర్దిష్టమైన వ్యక్తులు లేదా వ్యవస్థలను బాధ్యలుగా పరిగణించి చర్యలు తీసుకోనంత వరకూ సమస్యలు పునరావృతం అవుతూనే ఉంటాయని అభిప్రాయపడింది. ఏ బాధ్యతలు.. ఎవరివి.. అని గుర్తించనంత వరకు తప్పిదాలను ఒకరిపై ఒకరు మోపే అవకాశం ఉంటుందని పేర్కొంది.

ఒక వ్యవస్థలో ఒక తప్పు జరిగినప్పుడు, దానికి ఎవరు జవాబుదారీ అనే అంశంపై స్పష్టత ఉండాలని నొక్కి చెప్పింది. నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షలతో లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు ముడిపడి ఉంటాయని, తల్లిదండ్రులు వారిపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారని గుర్తుచేసింది. ఇలాంటి పేపర్ లీకేజీ ఘటనలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తీవ్రమైన మానసికక్షోభకు గురిచే స్తాయని గుర్తుంచుకోవాలని సూచించింది. గతంలో జరిగిన తప్పుల నుంచి ఎన్టీఏ ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోకపోవడం విచారకరమని వ్యాఖ్యానించింది.

ప్రశ్నాపత్రాల లీకేజీకి తావు లేకుండా శాశ్వత ప్రాతిపదికన పనిచేసే నిపుణుల విభాగాలను ఏర్పాటుచేయాలని కేంద్రప్రభుత్వానికి సూచించింది. సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తరఫున సాలిసిటర్ జనరల్ తుషార్‌మెహతా వివరణ ఇస్తూ.. కేంద్ర ప్రభుత్వం లీకేజీ వ్యవహారాన్ని ప్రాధాన్య అంశంగా తీసుకుందని, స్వయంగా ప్రధానమంత్రి ఈ సమస్యను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

రాధాకృష్ణన్ కమిటీ సూచించిన 60 సంస్కరణల్లో చాలా వరకు ఇప్పటికే అమలు చేశామని వివరించారు. అనంతరం సుప్రీం కోర్టు స్పందిస్తూ.. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకో బోతున్నారో పూర్తి నివేదిక ఇవ్వాలని కేంద్ర విద్యాశాఖను ఆదేశించింది. తదుపరి విచారణ జూలై రెండోవారానికి వాయిదా వేసింది.