ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించాలి
ఎస్పీ రోహిత్ రాజు
ఇల్లెందు, ఆగస్టు 17, (విజయక్రాంతి): పోలీస్స్టేషన్లలో ఆధునిక సాంకేతిక వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగించి ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన పోలీసు సేవలు అందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సూచించారు. సోమవారం ఇల్లందు పోలీస్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా సందర్శించి స్టేషన్ పరిసరాలు, వివిధ విభాగాల పనితీరును పరిశీలించారు. స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, సమస్యలతో వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరిస్తూ వారి సమస్యలను బాధ్యతగా పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు.
సైబర్ మోసాలపై వచ్చే ఫిర్యాదులకు వేగంగా స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెట్రోలింగ్, బ్లూకోలట్స్ వాహనాలతో నిరంతరం గస్తీ నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, డయల్ - 112కు సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు అండగా నిలవాలని సూచించారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్న ఎస్పీ, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ తనిఖీలో ఇల్లందు డీఎస్పీ వెంకన్నబాబు, సీఐ సురేష్, ఎస్త్స్రలు ఉమా, సారంగపాణి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






