సమస్యలను తెలుసుకున్నందుకే బుల్లెట్ పై ప్రయాణం
ఉట్నూర్,సిరికొండ,(విజయక్రాంతి): తన నియోజకవర్గంలోని మారుమూల గిరిజన గ్రామాల ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే బుల్లెట్ బండిపై మారుమూల గిరిజన గ్రామాలను పర్యటిస్తున్నారని గుర్తు చేశారు. ఇంద్రవెల్లి మండలంలోని వడ్గావ్, హీరాపూర్, మారుతి గూడ, లాల్ టెకడి గ్రామాల్లో పర్యటించిన అనంతరం సిరికొండ మండలంలోని కన్నాపూర్, కన్నాపూర్ గూడ, గ్రామాల్లో పర్యటించారు.
అక్కడినుండి చిక్ మన్ వాగులో నుండి బుల్లెట్ బండిని అతి కష్టం మీద బయటకు తీసి సిరికొండ మండలంలోని చీమన్ గుడి, వాయి పేట్, చింతగూడ, ఫకీర్ నాయక్ తండ, సత్ మోరి, లక్ష్మిపూర్ (బి ) తదితర గ్రామాల్లో పర్యటించారు. ప్రజల నుండి తెలుసుకున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ముఖ్యంగా టైగర్ జోన్ పరిధిలో ఉన్న గిరిజన గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను అడవి శాఖ అధికారులు అడ్డుకోవద్దని వారికి సూచనలు చేశారు. ఆదివాసీ గిరిజనులు అడవిని రక్షించుటలో ముందు వరుసలో ఉంటారని, ఈ విషయం అడవి శాఖ అధికారులు తెలిసిన అభివృద్ధి పనులను అడ్డుకోవడం సమంజసంగా లేదని అన్నారు. అడవి శాఖ అధికారులు అభివృద్ధికి కృషి చేయాలి తప్ప , అభివృద్ధి నిరోధకులు కాకూడదని ఈ సందర్భంగా వారికి హీతావు పలికారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






