9 May, 2026 | 4:33 PM

బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు.. స్పందించిన సబితా ఇంద్రారెడ్డి

09-05-2026 03:19 PM

హైదరాబాద్: తెలంగాణలో శాంతి భద్రతలు చూస్తే బాధాకరంగా ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఒకప్పుడు తెలంగాణ పోలీస్ అంటే దేశంలో మొదటి స్థానంలో ఉండేదని, అలాంటి పోలీసింగ్ వెనక్కి పోతుంది అంటే బాధగా ఉందన్నారు. ఈ రాష్ట్రానికి హోంమంత్రి లేకపోవడం వల్లే ఇలా ఉందని, బీఆర్ఎస్ నాయకుల మీద పెట్టిన శ్రద్ధలో 1% అయినా శాంతి భద్రతల మీద పెడితే దేశం ముందు తల దించుకునే అవసరం ఉండదని ఎమ్మెల్యే సబితా వ్యాఖ్యానించారు. 

బీఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకోకపోత దాడులు చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వార్నింగ్ ఇస్తున్నాడని, మరి రెండేళ్లలో రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి మేమెన్ని దాడులు చేయాలి, కానీ అది మా సంస్కారం కాదన్నారు. కాంగ్రెస్ బీజేపీ కొట్టుకోవడం కాదు బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని బండి సంజయ్ అంటున్నాడు. ఒక కేంద్ర మంత్రిగా పోలీసులకు ఎలాంటి ఆదేశాలు ఇస్తున్నారు? మాజీ మంత్రి ప్రశ్నించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కొడుకు పోక్సో కేసు వ్యవహారంపై ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పందించారు.

తప్పు చేస్తే కేంద్ర మంత్రి కొడుకుకైనా సామాన్యుడి లాగా శిక్ష విధించాలని, పోక్సో కేసు నమోదు చేసి చట్ట పరంగా చర్యలు తీసుకోవాల్సిందే డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరధ్ మీద పోక్సో కేసు నమోదైంది. తమ 17 ఏళ్ల మైనర్ బాలికకు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు పేర్కొన్నారు. మొయినాబాద్ ప్రాంతంలోని ఫార్మ్ హౌజ్‌తో పాటు మరో రెండు ప్రాంతాల్లో అత్యాచారం జరిగిందని, బీఎన్ఎస్ 74,75 సెక్షన్లతో పాటు, సెక్షన్ 11 ఆర్/డబ్ల్యూ12 పోక్సో చట్టం కింద బండి సాయి భగీరధ్ మీద పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశంపై బండి సంజయ్ కుమారుడు భగీరథ్ హనీ ట్రాప్ కేసు పెట్టారు.