7 August, 2026 | 5:24 AM

సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

07-08-2026 01:08 AM

బాన్సువాడ, ఆగస్టు 6 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గురువారం పరిశీలించారు.

ఈ సందర్భంగా రిజర్వాయర్ నిర్మాణ పనుల పురోగతిని అధికారులు, ఇంజినీర్లతో సమీక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాలుగు బండ్లలో భాగంగా మొదటి బండ్ నిర్మాణంలో రెండు స్లూయిస్లు (తూములు) పూర్తయ్యాయని తెలిపారు. గతంలో సిద్దాపూర్ చెరువులో నిల్వ ఉండే నీటి పరిమాణంతో పోలిస్తే ప్రస్తుతం దాదాపు రెట్టింపు స్థాయిలో నీటి నిల్వ సాధ్యమైందని, కట్ట ఎత్తు సుమారు ఐదు మీటర్లు పెరగడంతో రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు.

రిజర్వాయర్ నిర్మాణం వల్ల సిద్దాపూర్ పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాల మట్టం పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే ఆయకట్ట పరిధిలోని వ్యవసాయ భూములకు వానాకాలం, వేసవి పంటలకు అవసర మైన నీరు ఇప్పటికే నిల్వ ఉండడంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని వివరించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయిన అనంతరం ఆయకట్ట పరిధిలోని సుమారు 10 వేల ఎకరాలకు సాగునీటి సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు