మారేళ్లపాడు ఎత్తిపోతల పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలి
అశ్వాపురం,(విజయ క్రాంతి): అశ్వాపురం మండలంలోని సీతారామ ప్రాజెక్ట్ మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను సోమవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన, ఎలాంటి జాప్యం లేకుండా పనులను వేగవంతం చేయడంతో పాటు నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పనుల ప్రస్తుత పరిస్థితిపై వివరాలు తెలుసుకుని, మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, మండల అధ్యక్షులు, జిల్లా, మండల ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






