2 July, 2026 | 1:25 AM

వనపర్తి జిల్లా కేంద్ర అభివృద్ధికి మరో కీలక అడుగు

02-07-2026 12:25 AM

ఐటీ టవర్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి 

వనపర్తి, జూలై 01 (విజయక్రాంతి):  వనపర్తి జిల్లా కేంద్రంలో  రూ.22 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆధునిక ఇంటిగ్రేటెడ్ టవర్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి పట్టణాన్ని ఆధునిక నగరంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. 

వనపర్తి జిల్లాను సాంకేతిక రంగంలో ముందంజలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు. ఈ ఐటీ టవర్ నిర్మాణం ద్వారా జిల్లా యువతకు స్థానికంగానే ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గి, యువత తమ స్వస్థలంలోనే ఉద్యోగాలు పొందే అవకాశం కలుగుతుందన్నారు.

సాఫ్ట్వేర్ కంపెనీలు, స్టార్టప్ సంస్థలు వనపర్తికి రావడానికి ఈ టవర్ కీలక వేదికగా మారనుందని పేర్కొన్నారు. అత్యాధునిక సదుపాయాలతో నిర్మించబడనున్న ఈ ఐటీ టవర్ ద్వారా డిజిటల్ సేవలు మరింత విస్తరించడంతో పాటు కొత్త పెట్టుబడులు జిల్లాకు ఆకర్షితమవుతాయని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని వనపర్తిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు.

ఐటి టవర్ నిర్మాణానికి రూ 22 కోట్ల రూపాయలను మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి , ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు లకు ఎమ్మెల్యే  ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కదిరే రాములు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు  పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.