నిత్యం జనం మధ్యనే!
ప్రజా సమస్యలు వింటూ.. వాటి పరిష్కారం కోసం పోరాడుతూ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్‌రావు క్రియాశీలకపాత్ర
హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ ఎన్ రాంచందర్ రావు బాధ్యతలు స్వీకరించి విజయవంతంగా ఏడాది పూర్తయ్యింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్థానంలో 1 జూలై 2025న ఏకగ్రీవంగా బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది కాలంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంలో, ప్రజా పోరాటాలను నడిపించడంలో రాంచందర్ రావు తనదైన మార్క్‌ను సొంతంచేసుకున్నారు.
సౌమ్యుడిగా, వివాదరహితుడిగా రాంచందర్ రావుకు మంచి పేరుంది. ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ నేపథ్యంతో పాటు దశాబ్దాలుగా పార్టీకి నమ్మకమైన నాయకుడిగా, సీనియర్ న్యాయవాది కావడంతో బీజేపీ అధిష్ఠానం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజల్లో ఓ నమ్మకాన్ని కల్పించడంలో సఫలీకృతులయ్యారు. హైడ్రా, మూసీ పునరుజ్జీవం, గాంధీ సరోవర్ ప్రాజెక్టులపై బాధితులకు అండగా ఉన్నారు. సింగరేణి కాలరీస్ బొగ్గు మాయంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు.
ఆరు గ్యారంటీ, 420 హామీలు వంటి వాటిపై కాంగ్రెస్‌ను నిలదీస్తూనే ప్రజలను మమేకం చేసుకుంటూ ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. సర్వే ప్రక్రియలో ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తున్న తీరును ఎండగట్టారు. విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపైన పోరాటం చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేసే పనిలో పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 9 నూతన పార్టీ కార్యాలయాలను జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో కలిసి ప్రారంభించారు. రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీ సభను గ్రాండ్ సక్సెస్ చేయడంలో విజయం సాధించారు.
ఎన్నికల సన్నద్ధత, సమాయత్తంలో రాంచందర్ రావు వ్యూహాలు ప్రత్యర్థులకు పెను సవాళ్లుగా మారాయి. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ సర్పంచ్ స్థానాలను గెలుచుకుంది. మున్సిపాలిటీలో ఓట్ షేర్‌ను 15.45కు పెంచగలిగారు. తొలిసారిగా కరీంనగర్ కార్పొరేషన్‌లో బీజేపీ జెండా ఎగురవేశారు. ఖానాపూర్, భైంసా చైర్మన్ పదవులను కూడా బీజేపీ తమ ఖాతాలో వేసుకోగలిగింది. రాబోయే హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి, వరంగల్ ఇతర కార్పొరేషన్‌ల పీఠంపై రాంచందర్ రావు గురి పెట్టారు. ఇందులో భాగంగానే వ్యూహాత్మకంగా పార్టీ అనుబంధ కమిటీలను ఏర్పాటు చేసి అడుగులు వేస్తున్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించేలా పార్టీని, క్యాడర్‌ను సమాయత్తం చేసుకుంటూ ఎన్ రాంచందర్‌రావు ముందుకు వెళ్తున్నారు.






